పుట:Kavijeevithamulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

165

మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచేఁ బడ్డదు
    ర్దమదోర్దండపుళిందకోటి యవనవ్రాతంబు సప్తాశ్వమా
    ర్గమునం గాంచి శబాసహోహరిహరంగా ఖూబుఖోడాకితే
    తుముకీబాయల బాయిరే మలికి యందు ర్మింటికిన్ బోవుచున్.

మ. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచేఁ
    గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిర్ఘు రీపోషణీ
    మాయాభీకు ముటాకులో హుటు రేమాయాసటాజాహిరే
    మాయా న్మేయమడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్

శ్లో. వీరాగ్రేసర కృష్ణరాయ నృపతే త్వద్వైరికాంతా వనే
   ధావంత్యః కుచయానరో మలతికావ్యాహారలీలాభృతః,
   ప్రాప్తాన్ కోకమదేభపన్న గశుకాన్ రుంధంతి వక్త్రేందునా
   మధ్యే వాపి కచేన కంకణల సద్వైస్వర్ణరత్నై రపి.

సీ. చినుకుపూసలు గూర్చు చెలువైనపూదండ, దండాటగలవేల్పు తపసికొండ
   కొండాటములను జిక్కులు బెట్టుజడదారి దారితప్పక గట్టుజీరునలుగు
   నలుగ టింటికి వెన్నుఁ డిలకుఁ దెచ్చినచెట్టు, చెట్టుగొట్టగఁ జేయు చెలువతోడు
   తోదు క్రీడికి నైనదొరతోడఁబుట్టువు, పుట్టులిబ్బులకానిపొందుకాఁడు

గీ. కాడుపూరిజనించినఘనునితల్లి, తల్లిబిడ్డలఁ బెండ్లాడుగొల్లమనికి
   మనికితంబుల నీడేర్చుఘనులవిందు, విందు సత్కీర్తి నరసింహవిభునికృష్ణా."

మనుచరిత్రలో నల్లసానిపెద్దన యీక్రింది విధముగఁ గృష్ణరాయని వినుతించె ఎట్లన్నను :-

సీ. ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వనికుమా, రతకుఁ గ్రౌంచాచలరాజ మయ్యె
   నావాడపతిశకంధరసింధురాధ్యక్షు, లరిగాపు లెవ్వానిఖరతరాశి
   కాపంచగౌడధాత్రీతలం బెవ్వాని, కసివారుగా నేఁగునట్టిబయలు
   సకలయాచకజనాశాపూర్తి కెవ్వాని, ఘనభుజాదండంబు కల్పశాఖ

గీ. ప్రబలరాజాధి రాజవీరప్రతాప, రాజపరమేశ్వబిరుదవిభ్రాజి యెవ్వఁ
   డట్టిశ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుఁ, డొక్కనాఁడు కుతూహలం బుప్పతిల్ల."

అనునీపద్యమువలన మనుచరిత్రము కృతినందునాఁటికె కృష్ణరాయఁడు "ఉదయగిరిసీమ" ను జయించె ననియు నావాడశకంధరసింధు దేశాధిపతులు కప్పము నిచ్చుచుండి రనియుఁ బంచగౌడలదేశముపై ననేక పర్యాయములు దండయాత్రలు చేసె ననియు రాజాధిరాజ వీరప్రతాపరాజపరమేశ్వర బిరుదులు గల్గి యుండె ననియుం దేలినది.