పుట:Kavijeevithamulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కవి జీవితములు

పెద్దన దానికి సంతసించి "మనుచరిత్రం" బనునొకప్రబంధమును రచియించి తెచ్చెను దానిని సాంతముగ విని కృష్ణరాయఁ డతనికి విశేషబహుమానంబు గావించెను. ఈగ్రంథమునఁ బ్రబంధమునకు వలయు వర్ణన లన్నియు నున్న యవి. ఇందుఁ గల్పనలు శ్లేష విశేషముగ లేకుండనుండును. కొన్ని స్థలములు సంస్కృతజటిలములు. మఱి కొన్ని తావు లచ్చ తెనుఁగుగలవి. కొన్నిమిశ్రంబులు, ఈతనియుభయభాషాపాండిత్య మాయాస్థలములఁ జూచినచో గోచరం బగును, అప్పటివారలలోఁగూడ నీతని కీఁడగువాఁ డీతఁడే యని చెప్పవచ్చును. "పెద్దనవలెఁ గృతిసెప్పిన, బెఁద్దన వలె" అనులోకోక్తియుం గల్గె, ఈకవికి జ్యోతిషంబునఁగూడ నసమాన ప్రజ్ఞ గలదు. ఆవిషయమున పద్యము లచ్చటచ్చట నీగ్రంథముననే చూడనగును. సంస్కృతజటిలముగ నుండు పద్యము :-

క. నరనారాయణచరణాం, బురుహద్వయభద్రచిహ్న ముద్రితబదరీ
   తరుషండ మండలాంతర, సరణిం ధరణీసురుండు చనిచని యెదుటన్.

అన్యదేశ్యంబు లుంచి చెప్పినపద్యము.

సీ. పచ్చనిహరుమంజిపనివాగె పక్కెర, పారసిపల్లంబు పట్టమయము
   రాణ నొప్పోరుపైఠాణంపుసింగిణి, తళుకులకోరీఁతరకసంబు
   మిహిపసిండిపరంజు మొహదా కెలంకుల, ఠావుగుజ్జరివన్నె కేవడంబు
   డా కెలంకునసిరాజీక రాచురికత్తి, కుఱఁగటఁగ్రొవ్వాఁడిగొఱకలపొది.

తే. పీలికుంచెతలాటంబు పేరజంబు, మణులమొగముట్టుఁ బన్ని సాహిణియొకండు
   కర్తయెదుటికిఁ గొనివచ్చె గంధవాహ, బాంధవం బగు నొక మహాసైంధవంబు.

మిశ్రమున కుదాహరణము.

సీ. బుద్ధీంద్రియక్షోభములకుఁ బెట్టనికోట, విపదంబురాశిదుర్వికృతి|గోడ
   ఖలదురాలాపమార్గణవజ్రకవచంబు, రణమహీస్థలికి శ్రీరామరక్ష
   శాత్రవదుగ్గర్వసం స్తంభనౌషధి, మొనయుచింతాశ్రేణిమూఁకవిప్పు
   యోగాదిసంసిద్ధు లొనగూర్చు పెన్నిధి, తూలు నేకాకులతోడునీడ.

తే. సకలసుగుణప్రధానంబు సకలకార్య, జాలసాఫల్యకరణైక సాధనంబు
   ధైర్యగుణ మట్టిధైర్యంబుఁ దక్కి పాఱఁ, దత్తరింతురె యకట మీతరమువారు.

ఈ పెద్దనయే యపుడపుడు కృష్ణరాయలపై రచియించినచాటు థారపద్యములు కొన్ని గలవు. వాని నిచ్చోవివరింతము :-