పుట:Kavijeevithamulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

163

"క. హితుఁడవు చతురవచోనిధి, వతులపురాణాగమేతిహాసకథార్థ
    స్మృతియుతుఁడ వంధ్రకవితా, పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్."

"చ. ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢము గాక ద్రావిడీ
    స్తనగతిఁ దేట గాక యఱచా టగునాంధ్రవధూటిచొక్కపుం
    జనుగవఁబోలె గూఢముగ జాటుఁదనంబును లేక యుండఁ జె
    ప్పిన నదివో కవిత్వ మనిపించు నగిం చటు గాక యుండినన్."

"ఉ. అఱవలచన్ను లంబలె బయల్పడనీయక ఘూర్జరాంగనా
    గురుకుచయుగ్మముంబలె నిగూఢము కాక తెనుంగుదేశపుం
    గరితలచన్ను లంబలె నొకానొకయించుక గానుపించినన్
    సరసులు మెత్తు రక్కవితచందము నందముగా జంగంబునన్."

అని కృష్ణరాయఁడు పెద్దనకవిం జూచి తనపేరిటఁ గృతి రచియింప యత్నింపవలయు నని తఱచుగా నుత్సహించుచుండెనఁట ! అట్లుత్సహింపఁ బడినను మంచిది రచియించెద నని కాలయాపన చేయు చుండెను. గాని గ్రంథారంభముమాత్రము చేయఁబడదాయెను. ఒక నాఁడు పెద్దన యిట్లు కాలయాపన చేయుటకుఁ గారణ మేమి యుండు నని యూహించి యతనిం బిలువనంపించి కృతి రచియింప నారంభించినఁగాని తాను భుజియింప ననియు నాదినమునందే కృతి యారంభింపక తప్పదనియును బలవంత పెట్టి చెప్పిన విని పెద్దన యిట్లనియె.

చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చుక
    ప్పురవిడె మాత్మ కింపయినభోజన ముయ్యెలమంచ మొప్పుత
    ప్పరయురసజ్ఞు లూహ తెలియం గలలేఖక పాఠకోత్తము
    ల్దొరికినఁ గాక యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే.

అని నుడివిన రాయఁడు పెద్దన్న యభిప్రాయానుసారంబుగ నొక్క దివ్యభవనంబును, గోకట మొదలగు నగ్రహారాదికము నిచ్చి సంతోష పెట్టెను. అనంతరము కృష్ణరాయఁడు మరలఁ బెద్దనకవివలనఁ గృతినందు నిష్టము కలవాఁడై యిట్లనియె.

గీ. సప్తసంతానములలోఁబ్రశస్తిఁ గాంచి, ఖిలము కాకుండునది ధాత్రిఁ గృతియకానఁ
   గృతి రచింపుము మాకు శిరీషకుసుమ, పేశలనుధామయోక్తులఁ బెద్దనార్య.