కంకంటి పాపరాజు.
159
పాపరాజునకుఁ బుష్పగిరి తిమ్మకవి సహాయుఁ డౌట.
ఈపాపరాజునకు నుత్తరరామాయణగ్రంథరచనలోఁ బుష్పగిరి తిమ్మనకవి సహాయుఁడై యుండిన ట్లీగ్రంథములోననే కాన్పించును. ఆ వృత్తాంతముఁ జెప్పుటకు బూర్వము పాపరాజు తానొకకలఁ గంటి ననియును, ఆకల తనకు మిత్త్రుండును సహాధ్యాయియు నైనపుష్పగిరి తిమ్మకవితోఁ జెప్పఁగా నతఁ డందులవిశేషముల విప్పి చెప్పి తన్ను గ్రంథరచన కుత్సహించి సహాయుఁడు కాఁగాఁ దా నీగ్రంథమును బ్రారంభించితి ననియును జెప్పెను. ఎట్లన్నను:-
క. అని పల్కి యాకృపాలుఁడు, సనుటయు నే మేలుకాంచి స్వప్న మునం దు
న్నను నేలుస్వామిఁ గనఁ గలి, గెనె యని రోమాంచకంచు కితగాత్రుఁడ నై.
"మ. హనుమద్దివ్యపదారవింద మకరందానంద నేందిందిరా
త్ము ననేకాంధ్రకృతి ప్రకల్పనసమర్థుం బుష్పగిర్యిప్ప నా
ర్యునిసత్పుత్త్రునిఁ దిమ్మ నాఖ్యకవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ
ద్దున నేఁ బిల్వఁగఁ బంచి కన్న కల సంతోషంబునం దెల్పినన్.
"మ. అతఁ డానందముఁ జెంది నన్నుఁ గని యన్నా జాళువాపైఁడికిన్
గృతవర్ణాంచితరత్న మబ్బినటు లయ్యె న్నీవు వాక్ప్రౌఢిమం
గృతి సేయంగఁ దొడంగురామకథకుం గృష్ణుండు రా జౌటఁ బ్ర
స్తుతి గావింపఁగ మాకు శక్యమె భవత్పుణ్యప్రభావోన్నతుల్".
"తే. అని కిరీటికి శౌరి తోడైనయటుల, నమ్మహాకవి సాహాయ్య మాచరింపఁ
గృతి నొనర్పఁగఁ బూనినయేను మొదట, నెంతు మద్వంశవిధ మది యెట్టులనిన.
పాపరాజు కాలనిర్ణయము.
దీని సూచించుట కీగ్రంథములో నేమియు నాధారము లేదు. కాని యీగ్రంథకర్త పుష్పగిరితిమ్మకవిసమకాలీను డని చెప్పి యుండుటంజేసి యతనికాలముం బట్టి యైనను దీనిని నిర్ణయింత మని యోఁచింపఁగా నదియును నంతమాత్రముగానే యున్నది. అతనిపేరిట దశావతారచారిత్ర మనుగ్రంథ మొకటి ప్రఖ్యాతి నంది యున్నది. అది యతనిచే రచిత మైనను ధరణీదేవులరామమంత్రిపేరు బెట్టి రచియింపఁబడినది. అం దీతిమ్మనపే రైనను గానరాదు. ఇట్టిచో నేవిధముగ