పుట:Kavijeevithamulu.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంకంటి పాపరాజు.

157

"ఉ. శ్రీకరరామమంత్రజపసిద్ధిఁ బ్రసిద్ధి వహించి వెన్క వా
     ల్మీకి రఘుప్రవీరుకధలే రచియించి కదా చెలంగె ము
     ల్లోకములందు నెల్లమునులుం గొనియాడఁగ నట్టి దౌటఁ బు
     ణ్యాకర మైనరాముకథ హైన్యము మాన్పదె యెట్టివారికిన్."

అని యిన్ని విధములుగఁ బాపరాజు తనకు జనులవలనఁ గల్గఁబోవునిందను నివారించుకొనుటకుఁగాను యత్నించెను. ఇది యెంతశ్లాఘా పాత్ర మైనగుణము. ఆధునికులు పాపరాజుం జూచి కవిత్వ వి శేషములు నేర్చుకొనుటయే కాక గృహస్థమర్యాదను గూడ నేర్చుకొని యితరులు ప్రారంభించినకృతు లనునుచ్ఛిష్టమును గ్రహించుటకు సిద్ధపడకుండుట నేర్చుకొనెదరుగాక. అట్టికార్యముం జేయఁబోయి పొందెడియవమానంబునుండి తొలఁగుదురుగాక.

పాపరాజువంశముంగూర్చి.

ఈకవి తనవంశమును వర్ణించుకొనుటకుఁ బూర్వము తాను జన్మించిన నియోగిశాఖాబ్రాహ్మణుల నాఱ్వేలవారిని వర్ణించెను. ఆవర్ణన ప్రాచీనచారిత్రగాథల కన్నిటికిని సంగ్రహము గావున దాని నీక్రింద వివరించెదను :-

ఆఱ్వేలనియోగులవర్ణనము.

"సీ. అఖిలరాజాధిరాజాస్థానజనహృద్య, విద్యావిహారు లా ఱ్వేలవారు
    కల్పకబలికర్ణకలశార్ణవోదీర్ణ, వితరణో దారు లా ఱ్వేలవారు
    సజ్జన స్తవనీయసతతనిర్వ్యాజ, హారిపరోపకారు లఱ్వేలవారు
    ఘనదుర్ఫటస్వామికార్యనిర్వహణప్ర, వీణతాధారు లా ఱ్వేలవారు.

గీ. విమతగర్వాపహారు లా ఱ్వేలవారు, అట్టియా ఱ్వేలవారిలో నలఘుకీర్తి
   వెలయు శ్రీవత్సగోత్రారవిందహేళి, మహితగుణశాలి వల్లభామాత్య మౌళి.

దీనింబట్టి యాఱ్వేలనియోగులలోఁ బెక్కండ్రు రాజాధిరాజుల యాస్థానములలోఁ బ్రకాశింపఁ దగిన విద్యావిశేషములు గలవా రనియును, విశేషవితరణశాలు లనియును, నిందాదూరు లగుపరోపకారు లనియును, దుర్ఘటస్వామి కార్యనిర్వాహకు లనియును, శత్రువుల గర్వముం బరిహరించువారనియును దేలినది. అట్టియాఱ్వేలవారిలో శ్రీవత్సగో