పుట:Kavijeevithamulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కవి జీవితములు



సముఁ గూడఁ బూర్తిచేసిన బాగుగ నుండియుండు ననియును దోఁచునని మాత్రము చెప్పెదము.

___________

ఉత్తరరామాయణము.

9.

కంకంటి పాపరాజు.

పైనిర్వచనోత్తరరామాయణము కావ్యముగా రచియింపఁబడి యుండుటఁ జూచి కంకంటి పాపరా జనునతఁ డుత్తరరామాయణము మహా కావ్యముగా రచియించుట కుత్సహించి తిక్కనసోమయాజి చేసిన కావ్యమునే తాను మఱియొకసారి తెన్గుచేయుట చర్వితచర్వణ మనియు, నెచట నైన సమానవర్ణన లున్నచోఁ దనకవిత్వము తిక్కనసోమయాజికవిత్వముతో సరి తూఁగనిచోఁ బాఠకులు త న్నా క్షేపంబుచేసెద రనియు శంక మనస్సులో నుంచుకొని యీక్రిందిపద్యముచేతఁ దన యుద్యమమును వ్యక్తీకరించు చున్నాఁడు. అది యెద్ది యనఁగా :-

"మ. వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యం బై తగం జేసె ను
     త్తర రామాయణ మందున న్మఱి ప్రబంధం బూని నిర్మించు టే
     సరసత్వం బని ప్రాజ్ఞులార నిరసించంబోకుఁడీ రాఘవే
     శ్వరుచారిత్రము లెంద ఱెన్నిగతుల న్వర్ణించినం గ్రాలదే."

ఇట్లు చెప్పియు నుత్తరరామాయణమునే యాంధ్రీకరించుటకుఁ గలకారణము తిక్కనపైని పోటీగా వ్రాయుటకుఁ గాదనియుఁ దాను తరియించుటకు సాధన మనియుఁ దన యుపాసనాదేవుఁడు శ్రీరాముఁ డవుటంజేసి యందులఁకుగాను దా నాగ్రంథ మారంభించితి ననియు నీక్రిందిపద్యములలోఁ జెప్పెను. ఎట్లన్నను :-

"ఉ. మానక కర్మభూమిపయి మానుష దేహముతో హితాహిత
    జ్ఞాన మెఱుంగుబ్రాహ్మణుఁడు చారుకవిత్వము నేర్చి జానకీ
    జానికథ ల్రచింపక యసత్క థ లెన్ని రచించెనేనియున్
    వానివివేక మేమిటికి వానికవిత్వమహత్త్వ మేటికిన్.