పుట:Kavijeevithamulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరరామాయణసందర్భము. తిక్కన.

153

"క. అని సత్కవీంద్ర మార్గము, మనమున నెలకొల్పి సరసమధురవచోగుం
    భనసుప్రసాదసంబో, ధనగోచరబహువిదార్థతాత్పర్యము గాన్."

ఇట్లుగాఁ జెప్పి తా నుత్తరరామాయణము నాంధ్రీకరింపఁగడఁగుటకుఁ గారణ మీక్రిందివిధంబున వ్రాసెను. ఎట్లనఁగా :-

"క. ఎత్తఱి నైనను ధీరో, దాత్తగుణోత్తరుఁడు రామధరణీపతిస
    ద్వృత్తము సంభావ్య మగుట, నుత్తరరామాయణోక్తియుక్తుఁడ నైతిన్."

తిక్కన యిటుల వ్రాసి వెంటనే తనతాత యగు గుంటూరి మంత్రిభాస్కరునిఁ జూచి యైనఁ దనకవిత్వము సర్వజనాదరణీయ మగు నని పల్కిన దానింబట్టి తనతాతయే రామాయణము దెనిఁగించుటచేతఁ దనకు దానిం దెనిఁగించుట కవకాశము లేకపోవుటచేత నెట్లైన శ్రీరామకథం దెనిఁగించుటకుఁ దనకుఁ గల యుత్సాహమును జూపుటకు నుత్తర రామాయణములోఁ గల రామకథఁ దెనిఁగించినఁ జాలు నని మనస్సున సంతుష్టి నందినట్లుగాఁ గాన్పించును. అటు గాకున్నచో రామాయణమును దెనిఁగించుటకు భాస్కరునంతకవి యుండవలయును గాని తన వంటివాఁ డొకఁడు దానికై యత్నింపఁ దగునా యని యొరులు చేయుశంక మనస్సున నుంచికొని తిక్కన తాను భాస్కరకవి మనుమఁడనే యని చెప్పి యాభాస్కరుని సంప్రదాయానుసారముగనే తనకవిత్వముండు ననుటచేత రామాయణకవిత్వములోని సంప్రదాయ ముత్తర రామాయణములోఁగూడఁ గాన్పించు నని లోకమునకు స్పష్టపఱుపనైనను గావలయును.

తిక్కన తాను జేయు నిర్వచనకావ్యము పండితులకు మిక్కిలియానందదాయి కాఁగల దని యీక్రిందివిధమునఁ జెప్పెను. ఎట్లన్నను :-

ఉ. జాత్యను గామి నొప్పయిన సంస్కృత మెయ్యడఁ జొన్ప వాక్యసాం
   గత్యము సేయుచో నయిన గర్వము తోడుగఁ జెప్పి పెట్ట దౌ
   ర్గత్యముఁ దోఁపఁ బ్రాసముప్రకారము వేఱగునక్షరంబులన్
   శ్రుత్యనురూప మంచు నిడ శూరుల కివ్విధ మింపుఁ బెంపదే.

క. లలితపదహృద్యపద్యం, బులన పదార్థంబు ఘటితపూర్వాపరమై
   వెలయ నిడి విణియలనఁగా,హల సంధించినవిధంబు నమరఁగ వెలయున్.