పుట:Kavijeevithamulu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కవి జీవితములు

అని యిట్లు కృతనిశ్చయుండై తిక్కన మనుమసిద్ధి రాజునకు నంకితము చేయఁబోవుకృతిలోనివిశేషముల నీక్రిందివిధముగ సంగ్రహించి వ్రాయుచున్నాఁడు. ఎట్లన్నను :-

"ఉ. భూరివివేకచిత్తులకుఁ బోలు ననన్ దలఁ పందలంబులన్
    సౌరభ మిచ్చుగంథవహుచందమునన్ఁ బ్రకటంబు సేసి యిం
    పారెడుపల్కులం బడయ నప్పలుకుల్ సరివచ్చునట్లుగాఁ
    జేరుప నేరఁగా వలయుఁ జేసెద నేకృతి యన్న వారికిన్."

ఇట్లని యనంతరము కుకవినిందఁ జేయుటకుఁ గా నీక్రిందిపద్యంబుఁ జెప్పెను. ఎట్లనిన :-

"చ. పలుకులపొందు లేక, రసభంగము చేయుచుఁ, బ్రాఁతవడ్డమా
    టలఁ దమనేర్పు చూపి, యొకటన్ హృదయం బలరింప లేక, యే
    పొలమును గాని యెట్టిక్రమమున్ దనుమెచ్చుగ లోక మెల్ల న
    వ్వులఁ బొరయన్ జరించకుకవుల్ ధర దుర్విటులట్ల చూడఁగన్."

అని యిట్లు కుకవినింద చేసి యంతటితోఁ బరిసమాప్తి నందిపక భావికాలములోఁ దెనుఁగుకవిత్వముఁ జెప్పుసుకవులకు నుపయుక్తము లగుకొన్ని సూత్రప్రాయము లగుపద్యములంగూడ వ్రాసెను. అవి యెవ్వి యనఁగా :-

వడి ప్రాసవిషయము.

"క. తెలుఁగుకవిత్వముఁ జెప్పన్, దలఁచినకవి యర్థమునకుఁ దగి, యుండెడుమా
    టలు గొని వళులుం బ్రాసం, బులు నిలుపక యొగిని బలిమి బుచ్చుట చదురే."

తద్భవములఁ గూర్చి.

"క. అలవడ సంస్కృతశబ్దము, తెలుఁగుపడి విశేషణంబు తేటపడంగాఁ
    బలుకునెడ లింగవచనం, బులు భేధింపమికి మెచ్చు బుధజనము కృతిన్."

సరసాహ్లాదముగఁ జెప్పవలెనని.

"గీ. ఎట్టికవి కైనఁ దనకృతి యింపుఁ బెంపఁ, జాలుఁ గావునఁ గావ్యంబు సరసులైన
    కవులచెవులకు నెక్కినఁ గాని నమ్మఁ, డెందు బరిణతి గలుగుకవీశ్వరుండు."

అని యిట్లు సత్కవులమార్గము నుడివి యట్టిమార్గము ననుసరించి తా నుత్తర రామాయణమును రచియించెద నని యీక్రిందిపద్యములలో వ్రాసెను ఎట్లన్నను :-