పుట:Kavijeevithamulu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరరామాయణసందర్భము. తిక్కన.

149



వస్తువంశములోనివాఁ డని గ్రంథారంభములో నీక్రిందివిధంబుగ వ్రాయఁబడి యున్నది. ఎట్లన్నను :-

"క. పరవస్తు వంశరత్నా, కరకౌస్తుభమణి ప్రభావఖని యై నాకున్
    బరమగురు వైనముమ్మిడి, వరదాచార్యాంఘ్రివనజ వందారుఁడనై"

దీనింబట్టి రామభద్రకవి వరదాచార్యులసమకాలీనుఁ డని తేలినది.

రామాభ్యుదయగ్రంథకృతిపతి యగుగొబ్బూరినరసరాజు భోజనపపల్లెనారాయణాచార్య శిష్యుఁడు. కావున వీరందఱును సమ కాలీనులే. గొబ్బూరి నరసరాజు వసుచరిత్రకృతిపతి యగుతిరుమల రాజుమేనల్లుండని యిదివఱకే వ్రాసి యున్నారము. కావున నీపై వారలందఱు శాలివాహనశకము 15 శతాబ్దముచివరవా రనియుఁ, బదునాఱవ శతాబ్దములోని మొదటిపాదములోఁగూడ నున్నారనియును జెప్ప నొప్పి యున్నది.

రామభద్రకవిగోత్రము.

దీనిని దెలియుటకుఁ దగినయాధారములు పైగ్రంథములో లేవు. కాని యయ్యలరాజువారివలనం జెప్పఁబడినమఱికొన్నిగ్రంథములం బట్టి చూడఁగా నీరామభద్రకవి కౌండిన్యసగోత్రుఁ డని తేలుచున్నది. అందు శుకసప్తతిని దెనిఁగించిన కవీశ్వరుఁడు తనగోత్రము చెప్పి తన వంశములోనికవీశ్వరులను జెప్పుచు "మాయయ్యలరాజువంశజుల నాది కవీంద్రులఁ బ్రస్తుతించెదన్" అని వ్రాసియున్నాఁడు.

ఉత్తరరామాయణకవులు.

వాల్మీకికృతసంస్కృతరామాయణగ్రంథములో మొదటి యాఱు కాండలు కలసి యొక్కటిగా నుండును. కావున రామాయణము షట్కాండములు గలదిగానే వ్యవహరింపఁబడుచున్నది. అందు శ్రీరామ పట్టాభిషేకాంత మైనకథ గలిగియుండును. అనంతరవృత్తాంత మంతయు నుత్తరకాండ మనుపేర నొప్పియుండును. అందు శ్రీరామరాజ్య విశేషములును, పుత్త్రోత్పత్తియు, నశ్వమేధయాగమును జేయుటయు,