పుట:Kavijeevithamulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయ్యలరాజు రామభద్రయ్య.

143



అనంతరము దీనిఁ జదివికొని యాతఁడు లజ్జించి యూరకుండెను. కాని రామభద్రునియెడ నెడతెగనివైరము గల్గియుండెను. ఇట్లుండఁ గొంతకాలము జరిగినది.

భట్టుమూర్తిశపథము.

అపు డొకానొకదినమునఁ గృష్ణరాయసింహాసనాసీనుం డగు వేంకటాద్రిసమీపమున నీయిరువురకు మఱలఁ గలహము విద్యావిషయమున సంభవించినది. అపుడు భట్టుమూర్తి రామభద్రుని జూచి "నిర్దోషంబుగ నీ వొకప్రబంధము సేసి తెమ్ము. దానిలో దోషము నేఁ జూపెదను. అటు గాకున్న నేఁ జేసి తెచ్చెదను. దానిలోన దోషమును జూపెదవేని నేను నీచెప్పినశిక్షకుఁ బాత్రుండ నయ్యెదను. నీ దానిలోఁ దప్పేఁ జూపించిన నీశిరంబున నాపాదంబు ధరించెదే?" అనుడుఁ గృద్ధుండై రామభద్రుఁడు వీని పోతర మడంచుట మంచిదని యి ట్లనియె. "ఓయీ ! నేను గ్రంథమును రచించి తెచ్చెదను. దానిలో దోషమును జూపలేకున్నచో నాతన్ను నందెదే" అనుడు వల్లె యనియె. అపుడు రాజుం జూచి భట్టుమూర్తి యితఁడు గ్రంథమును రచియించుటకు నాఱుమాసములు వ్యవధి యిచ్చితిని. నాఁటికిఁ దేకున్నచో నీతని కిదియ శిక్ష యనియెను. రామభద్రుఁడు పిమ్మట నిజనివాసమునకుఁ జనియెను. భట్టుమూర్తి యితని గ్రంథవృత్తాంత మరయుటకై చారుల నియమించెను. రామభద్రుఁ డవమానము సంప్రాప్తం బవు నని బెంగటిల్లి యేకార్యము చేయుటకును జే యాడక తనయిష్ట దేవుం డగురామభద్రుని ధ్యానింపుచు నూరకుండెను. ఇట్లుండ నేకదినావశిష్టంబుగ నాఱుమాసంబులును గడచినవి. ఆదినమున రామభద్రుఁ డేమియుఁ జేయక ప్రాణత్యాగము సేయ నిశ్చయించి తనసేవకుఁ డగు నొక బాలునకుఁ గొంతసొమ్మిచ్చి వననాభిఁ దెమ్మని పనిచె. ఇట్లుండ నొకచిత్రవృత్తాంతము జరిగినదఁట. దానికి మన మద్భుతపడ నవసరము లేదు. గొప్పకవులును రాజులును భగవత్సాక్షాత్కారము గల్గియుందు రనియు నట్టిభగవత్సహాయముచేతనే యనన్యసాధ్య