పుట:Kavijeevithamulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

కవి జీవితములు



లోపున ననఁగా క్రీ. శ. 1027 మొదలు 1077 లోపుగానై యుండును. కావుననే యీకృతిరచన భారతమునకుఁ బూర్వమే యని నిర్ణయింప వలసి యున్నది. అప్పటికి నన్నయభట్టారకునియాంధ్రశబ్దచింతామణి పుట్టి యుండినట్లు కాన్పించదు. కావున నిందు నాంధ్రశబ్దచింతామణికి విరుద్ధము లైనకొన్ని ప్రయోగములు గాన్పించును. ఆంధ్రశబ్దచింతామణి ననుసరించియే భారతము రచియింపఁబడినది గనుక భాస్కరరామాయణము దానికిఁ బూర్వ మనియే చెప్పనొప్పును.

సోమదేవరాజీయములోఁ బ్రతాపరుద్రునిదర్శనమునకు వచ్చు వారు "శాకల్లిమల్లికార్జునభట్టు" మొదలయిన బ్రహ్మవిద్వాంసులు బంగరుపల్లకీ లెక్కి వచ్చువారు నూటయేఁబండ్రును, హుళిక్కిభాస్కరుఁడు మొదలుగాఁ గలనత్కవీశ్వరు లిన్నూటయేఁబండ్రును, గుండభొట్లు, ప్రతాపభోట్లును మొదలగు వేద వేదాంగపారగు లయినపురోహితు లిన్నూట యిరువండ్రును" అని చెప్పఁబడి యుండెను. అందులోనే హుళిక్కిభాస్కరునివిషయమై మఱియొకచోటఁ గొన్ని మాటలు వ్రాయఁబడి యున్నవి. అవియును నాగ్రంథక ర్తచేఁ గాలనిర్ణయ మెఱుఁగ కుంటచే వ్రాయఁబడినవిగా భావింపవలసియున్నవి. అందుఁ గొన్ని రెండవరుద్రుని వృత్తాంతములును గొన్ని మొదటిరుద్రునివృత్తాంతములును వ్రాయఁబడినవి. ఆరుద్రచరిత్రములో నదియంతయు స్పష్టపఱుపఁబడును.

భాస్కరనాములంగూర్చి.

రామాయణమును దెనిఁగించినభాస్కరుఁ డాంధ్రదేశములో సుప్రసిద్ధుఁడే. అయినను నతనినామము గలవారు మఱికొన్ని కార్యములలోఁ బ్రసిద్ధి నొందినవారును మఱికొందరు గలరు. కావునఁ బాఠకులు "గుంటూరిభాస్కరుఁడు, హుళిక్కిభాస్కరుఁడు" అనువా రిరువురును నొకరే యనియును, "వినుకొండభాస్కరుఁ"డని యున్న పు డతఁడు దానమున విఖ్యాతుఁ డగు "రాయనిభాస్కరుఁ"డనియును, "గుంటుపల్లిభాస్కరుఁ"డని చెప్పినచో నింద్రజాలాదికములఁ జేసి నేఁటివఱకును విప్రవినోదులు మొదలగువారివలనఁ దద్విద్యాప్రకటనావసరమున స్మరియింపఁబడు