పుట:Kavijeevithamulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హుళిక్కి భాస్కరుఁడు

129



కుమారరుద్రదేవప్రణీతం" బని యుండుట చేత నితనికుమారుఁడు రుద్ర దేవుఁడనియుఁ జెప్పుటకు సరిపడి యున్నది. కాని యిచట సాహిణిశబ్ద మేమిగాఁ బ్రయోగింపఁబడినదో దానిని యోచింపవలయును. కిష్కింధా కాండాంతమున "రథినీపాలాగ్రణీ సాహిణీ" అని యుండుటచేత నిది వంశనామముగా సూచించుచున్నది. ఇది వంశనామమే కాకున్నచోఁ బ్రతిచోటను "సాహిణిమారా" అని సంబోధనతో నవసరముండదు. మారయకుమారకుమారరుద్రదేవప్రణీత కృతిలో నీతని కుమారుం డని చూపుటకుఁ దగినవిశేషణములు వ్రాయక "సకలకలావిశారద" మొదలగునితరవిశేషంబు లుంపఁబడియెను. దీనిచేత మన మీవిధ మని నిర్ణయింపఁజాలము. కాని పైకథ యంతయు నవిశ్వస నీయ మని చెప్పఁదగినయొకవృత్తాంతముమాత్ర ప్రస్తుతము మనకు లభ్య మయినది. దాని నిచ్చో వివరించి మనయభిప్రాయము పిమ్మట దెల్పుదము ఈదేశములో ముప్పదియిద్దఱునియోగులపద్య మని యొక సీసమాలిక సర్వత్ర వాడుకలో నున్నది. అందులో నీసాహిణిమారుఁడును నొక్కఁడుగా లెక్కింపఁబడినాఁడు. దీనిఁబట్టి యిప్పు డితఁడు నియోగిబ్రాహ్మణుఁ డని నిర్ణయించి క్షత్త్రియపరముగా నన్వయింపఁబడినవిశేషణము లుపమలుగాఁ గై కొనవలయు నని చెప్పుదము. ఆపద్య మెట్లన్నను.

ముప్పదియిద్దఱునియోగులపద్యము.

సీ. కవు లిచ్చి భూపతి గాచి పట్టగ నొల్పెఁ, బ్రజలకై రాయనభాస్కరుండు
   వర దాతయై మణీవలయము ల్కవి కిచ్చె, దండిభాస్కరునూతి కొండమంత్రి
   భాస్కరువలెఁ గీర్తిఁ బడసెఁ దత్పౌత్రుఁ డౌ, ఘనరామలింగభాస్కరుఁ డొకండు
   గణకనిర్వాహంబు గల్గించె నూరూర, మహి గోపరాజు రామప్రధాని
   దుర్గ మియ్యక శత్రువర్గంబుతోఁ బోరెఁ, బెల్లుగాఁ గరణముమల్లమంత్రి
   యాత్మీయతపముచే నర్థి నాలుకమడ్డు, కేడించె బండారుకేతమంత్రి
   కవి పాముచేఁ జావఁగను నాయు వాతనికై యిచ్చె నేదమయాజిఘనుఁడు
   వేటారుతునిలయ వినుతులఁ జెండాడె, నాజిలో నాదెళ్ల యయ్య లయ్య
   పోరిలో నసహాయశూరుఁడై తెగి వెన్కఁ, బ్రతికె సిద్ధయతిక్కఁ డతులితముగఁ