పుట:Kavijeevithamulu.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
127
హుళిక్కి భాస్కరుఁడురామాయణ మని నామము కల్గినది. ఈరాజు దీనిఁ దెనిఁగించుకాలమునకు నన్నయభట్టారకుఁడు వ్యాకరణము చేసి యున్నట్లు కానరాదు. ఇందుఁ గొన్ని ప్రయోగములు నన్నయభట్టీయమతానుసారముగ నుండవు. ఆయాప్రయోగభేదములు గ్రంథము సావకాశముగఁ జూచినచో గోచరము లగును. పూర్వ వ్యాకరణములకు నిందు లక్ష్యములు పెక్కులు గాన్పించును. ఈగ్రంథములోనికల్పన లన్నియు మృదువు లయినవియు మధురము లయినవియు. ఇట్టిగ్రంథమును జూచి పద్యముగ దీని నితకంటెను బ్రౌఢిమతోఁ దెనిఁగింపఁ దలఁచి భాస్కరుఁడును రామాయణమును శిష్యులతోఁ గలిసి యారంభించి గ్రంథము ముగించె నని కొందఱయభిప్రాయము. ఈగ్రంథమును దొలుత మల్లికార్జునభట్టారకుఁడు ప్రారంభించి కోనభూవిభుఁడు తనతండ్రిపేరు గ్రంథమున కుంచినట్లతఁడును దనతండ్రిపే రాగ్రంథమున కుంచినట్లును మఱికొందఱు వాడుదురు.

రామాయణముపై విమర్శనము.

1. ఇందలిబాల కాండములోఁ గృతిముఖమునఁ గృతిపతి వర్ణన గాని, కవివంశవర్ణనము గాని లేదు. ఆశ్వాసాంతమునందును గృతిపతి పేరు చెప్పఁబడక గిరిజాధీశునకుం గృతి యిచ్చినట్లుగా నున్నది. దీనిచివరను గవినామము తెలుపుగద్యముమాత్ర మున్నది. అందులో "అష్టభాషాకవిమిత్రకులపవిత్రభాస్కర సత్కవిపుత్త్ర మల్లికార్జునభట్ట ప్రణీతం బైన" అని వ్రాసి యున్నది.

2. అయోధ్యాకాండములో "బుద్ధయకుమార సాహిణిమారా" అని కృతిపతి సంబోధింపఁబడియెను. ఆశ్వాసాంతములో "కాచమాంబాకుమారా" యని చెప్పఁబడియె. ఆశ్వాసాంతగద్యములో "సకలకళావిశారదశారదాముఖముకు రాయమాణసారస్వతభట్ట బాణనిశ్శంకవీర మారయకుమారకుమారరుద్రదేవప్రణీతం" బని గ్రంథకర్త వివరించెను.

3. ఆరణ్యకాండముమొదట నాశ్వాసారంభములో సాహిణి