పుట:Kavijeevithamulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హుళిక్కి భాస్కరుఁడు

125



మే కావలసి యున్నది గనుకను నాకృతి మారనపేరిట నిచ్చి యుండును. అట్లు గాకున్నచో సత్కవి నీచు నేల కృతిపతిం గావించును? అట్లుండదు. సాహిణిమారునిపూర్వులు తగినంతగొప్పవారు కాకపోవచ్చును. కావున రామాయణకృతిముఖంబున నతనివంశముమాత్రము వర్ణింపఁ బడక యుండవచ్చును. భాస్కరుఁ డీసాహిణిమారుని నుతించి చెప్పినపద్యము లనేకములు. అందొకచాటుధారాపద్యము నీక్రింద వివరింతము :-

"క. అప్పు లిడునతఁడు ఘనుఁడా, యప్పు డొసఁగి మఱలఁ జెందునాఁతడు రాజా
    చెప్పఁగవలె సాహిణిమా, రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్."

ఈ రామాయణగ్రంథకవులశయ్యాదులంగూర్చి ముందు వ్రాయుదము :-

గ్రంథోత్పత్తికారణము.

ఈగ్రంథోత్పత్తినిగూర్చి "పురాణనామచంద్రిక" అనుగ్రంథములో నొకతీరునఁ జెప్పఁబడి యుండెను. అది యెంతవఱకు నిజమో మనము చెప్పఁజాలము. అందు యధార్థము విశేషీంచి యుండవచ్చు నని యూహింపఁదగి యున్నది. ఆకథ యెట్లన్నను :-

"భాస్కరరామాయణము" భాస్కరునివలన నైనరామాయణము. ఇది భాస్కరుఁడు, అతనికుమారుఁ డగుమల్లిఖార్జునభట్టు, శిష్యుఁ డగుకుమారరుద్రదేవుఁడు, స్నేహితుఁ డగునయ్యలార్యుఁడు, ఈనలుగురుకవులచేతను రచియింపఁబడినది. అయినను వారిలో భాస్కరుఁడు ముఖ్యుఁ డగుటచేత నీగ్రంథము భాస్కర రామాయణము మన నెగడి యున్నది. ఇది యిట్లు రచింపఁబడుటకుఁ గారణ మేమనఁగా నాకాల మం దితనికి నాశ్రయుండై యుండినరాజునొద్ద నతనిబంధు వైనరంగనాథుఁ డనునాతఁడు రాజుయొక్క యాజ్ఞను బొంది ద్విపద రామాయణము రచియింపఁబూనుకొనఁగా నతనియందుఁ దనకుఁ గలసహజమత్సరము చేత రాజుతో "నీఘనతకు ద్విపదకావ్యము తగినది కాదు. నేను బద్యకావ్యమును జేసికొని వచ్చెదను. దానినిఁ బరిగ్రహింపుము" అనఁగా నతఁడు చెప్పినమాట తప్పుట యుక్తము గాదు గనుక రంగనాథుని