పుట:Kavijeevithamulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

119



సమర్థుం డనిరి. ఎంతకాలములోపల దీని నీతఁడు రచంపఁగలఁ డనుడుఁ గొంద ఱితని కొకవత్సరంబు చాలు ననిరి. మఱికొంద ఱాఱుమాసంబులు పట్టు ననిరి. అందుపై రా జీతనిం జూచి మూఁడుమాసములకు సంపూర్ణ మగునా? యనుడుఁ బినవీరన నవ్వి యొకమాసములోపల సెల వేనిఁ దెత్తు ననియెను. అపుడు రాజు త న్నెగతాళి సేయుట కాతఁ డట్లనె నని యూహించి మనంబునం గోపించి యొకమాసంబునకుఁ దేకున్నచో :- అని యూరకుండెను. దాని విని వీరన మరల నవ్వి "అట్లు తేకున్నచో మీయిష్టానుసారముగఁ గార్యము నడుపుఁ" డనియెను.

రాజును మంచిదే యని యపుడ కర్పూరతాంబూలంబు తెప్పించి యిచ్చి యాతనికి సెల విచ్చెను. వీరన యచ్చోటు వాసి యెప్పటి యట్ల తనలీలా వాసంబునకుం జనుదెంచెను. సభ్యులందఱు నీపినవీరన వాక్యంబులకు భయ మంది "అయ్యయో! యీతనికి మతిభ్రమణంబు గల్గె నని తోఁచెడిని. ఆస్థానంబున నిట్లు వృథాజల్పనంబు లాడఁగూడునే? అనుడు మఱికొందఱు "బాగుబాగు ! అతఁ డూరక ప్రగల్భ వాక్యములు పల్కు వాఁడుగాఁడు. ఏదియేని ధైర్యముచేతనే యిట్లు అని యుండును. లోకమునఁ దనముప్పు దప్పించుకొనఁ బ్రయత్నంబు సేయనివా రొకరుం గలరె. అయిన మన మొకనెల యోపికపట్టి యున్నచో సర్వంబును దెల్లం బగును." అని నిజనివాసంబులకుం జనిరి.

ఇట పినవీరన రాజుకడఁ దాంబూలం బందినవృత్తాంతంబు సభ్యులవలన నితనియన్న విని భయకంపితశరీరుండై తమ్ముఁ డింటి కెప్పుడు వచ్చు నని యతనిరాక కెదురు చూచుచుండెను. ఇట్లుండఁ గొంతవడికిఁ దమ్ముఁ డింటికి వచ్చెను. అప్పు డాతఁ డతనిహస్తములు పట్టుకొని దైన్యము ముఖమునం దోఁపఁ "దమ్ముఁడా ! రాజుకడ నీ వట్టిప్రతిన పట్టుట తగునా ? నెఱ వేఱున నసాధ్యం బగుపని నెఱవేర్ప నేరితరంబు ? నీవు మొదటినుండియుఁ గడు దుడుకవుగనే యుంటివి గదా ! ఇఁక నేమి