పుట:Kavijeevithamulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

శ్రీదక్షిణామూర్తయే నమ:

కవిజీవితములు

ప్రథమభాగము

1

వేములవాడ భీమకవి.


ఈకవిశిఖామణి వేములవాడ యనునొకయూర జన్మంబుం గాంచుటంజేసి యిట్టిగృహనామంబు గలిగినది. ఈగ్రామము గొందఱు కృష్ణామండలములోని దందురు. మఱికొందఱు గోదావరీమండలలోనిదే దందురు. కొన్నికొన్ని కారణములచే నిది గోదావరీమండలములోనిదే యని నిశ్చయింపఁబడినది. ఇది కాకినాడకు సమీపమున నున్న యది. దీనికిఁ గొంచెముదూరముననే దాక్షారామము (దక్షవాటిక) అనుగ్రామ మున్నది. అచ్చటనే భీమనాయకస్వామి యున్న వాఁడు. ఆయీశ్వరునికటాక్షాతిశయమున నీతఁ డుద్భవించె ననియు నాతని కీతఁడు కుమారుఁడే యనియు వాడుక గలదు. ఇది యెంతవఱకు నమ్మఁదగినదో మనము చెప్ప లేము. ఇట్టివార్తలు మనహిందువులలోనే కాక క్రైస్తవులు మొదలగు నితరమతములవారిలోనుం గలవు. ఈవిధముననే క్రీస్తువు భగవంతునికుమారుఁ డని జగత్ప్రసిద్ధి గలదు. అట్టివృత్తాంతమును నమ్మువారు దీనిని విశ్వసింతు రని నమ్ముదము. ఇట్టివృత్తాంతములు ప్రతి మతములోనను మహాత్ములంగూర్చి చెప్పునప్పుడు కల్గును. కావున నందఱును నమ్మవలసినదే కాని వేఱు కాదు. అట్టివారిలోఁ గొందఱు నమ్మమనుట కలిగెనేని వారు తమమతము నట్లే గ్రహించి రనవచ్చును. అయినను మన మిపు డావిషయమునుగూర్చి మాటలాడవలసినది లేదు. భీమనజన్మ వృత్తాంతము గొంత వక్కాణింతము.