పుట:Kavijeevithamulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

కవి జీవితములు

తే. మఱ్ఱిసూత్రంబె పిల్లలమఱ్ఱిపేరు, పేరువలెఁ గాదు శారదాపీఠకంబు
   వారిలోపలఁ బినవీరువాక్యసరణి, సరసులకు నెల్లఁ గర్ణరసాయనంబు.

అనుదీనింబట్టి యితనివంశముయొక్కనామము పిల్లలమఱ్ఱివారనియును, అది శారదాపీఠ మగుమఱ్ఱి యనియును, అం దనేకులు కవులుండిరనియును, వారియందఱలో నీ పినవీరన (పినవీరభద్రకవి) యొక్క వాక్యరచన సరసకర్ణ రసాయనం బనియును దేలినది. పైపద్యములో నీ కవివంశమువారిలోఁ బెక్కండ్రు కవులున్నా రని చెప్పినచో నితనితండ్రి తాతలు కవు లగుదురో కారో యనుశంక కల్గు నని నిశ్చయించుకొని సభ్యు లీక్రిందివిధంబుగ నింకొకపద్యముం జెప్పిరి. ఎట్లన్నను :-

క. తాతయుఁ దండ్రియు నగ్ర, భ్రాతయునుం దాను భువనభాసురకృతిని
   ర్మాతలు పిల్లలమఱ్ఱి వి, ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.

ఇ ట్లీపద్యమున ననుస్యూతముగఁ బినవీరనవంశమునఁ గవు లున్నా రని తెల్పుట వీరనకవిత్వము సంప్రదాయసిద్ధ మైన దనియును ఆవిషయమై శంకింపవలసిన యవసరముండ దనియును రాజునకు విస్పష్ట మగుటకుఁగా నై యున్నది.

కాలనిర్ణయము.

ఇఁకఁ బినవీరనకవియొక్క కాలము నిర్ణయింపవలసియున్నది. అది రెండువిధములుగనై యుండును. అందు మొదటిది యితనిప్రభుం డగు గుండమరాజు కాలవిజ్ఞానము. రెండవది పినవీరనతో సమకాలీనుల గాలవిజ్ఞానము. ఇందు మొదటిది కష్టసాధ్య మగునదియును, రెండవది మిక్కిలి సులభ మైనదియు నై యున్నది. కావున రెండవదానింబట్టి దీనిని నిర్ణయించెదను.

ఆశ్వాసాంతగద్యములో :-

"ఇది భారతీతీర్థ శ్రీచరణకరుణాపాత్ర గాదయామాత్యపుత్త్ర వినయవిద్యా సముద్ర, పినవీరభద్రప్రణీతం బైన జైమినిభారతము"

అని చెప్పియుండెను. కావున నీతఁడు భారతీతీర్థుల శిష్యుఁడు. అట్లగుటచేఁ బినవీరన యతనిసమకాలీనుఁడే కదా. ఇఁక భారతీతీర్థుల కాల మెప్పటిదో తెలియవలయును.