పుట:Kavijeevithamulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

కవి జీవితములు



వున వీరు ప్రామాణికకవు లని వాడఁబడుదురు. వీరిప్రయోగంబు లే జను లందఱుం బ్రయోగింపందగును. ఇతరకవులు వీరికి భిన్నంబుగఁ బ్రయోగంబులు సేసినను నాశబ్దంబులు బుధజనాదరణంబు నొందవు. వీరు తఱుచు ఱాకును రేఫమునకు మైత్త్రిం జెప్పి యుండ లేదు. కావున నితరకవులు వానికి మైత్రిఁ జెప్పి ప్రయోగించుటకు సంశయింతురు. వీరి కాలమునాఁ డగుభీమకవి వీనిమైత్త్రికి సమ్మతించెను. అందుల నప్పకవిమాత్రము సమ్మతింపఁడయ్యెను. దానికి నాతనిచేఁ జెప్పఁబడిన కారణము లిప్పటివారికి సమ్మతములు గావు. ఎఱ్ఱప్రెగ్గడయుఁ గవనంబున నన్న యతిక్కనలకు సరియగువాఁడు. ఈతఁడు భారతంబున మిక్కిలి తక్కువభాగంబుఁ దెనిఁగించి యుండుటంజేసి యిం దీతనిపాండిత్యము మనకుఁ దెల్లంబు గాదు. ఈతఁడు దెనిఁగించినభారతముతోఁ జేరినహరివంశంబున నీతని సామర్థ్యాతిశయంబు బోధ యయ్యెడిని. ఈతనికవనము నన్న యతిక్కనల కవనముకంటె నించుక కఠినము. విశేషించి తెనుఁగుపదంబులఁ బ్రయోంగించునిష్టము గలవాఁడు. అచ్చటచ్చట సంస్కృతజటిలంబు లగుసమాసములు గాననయ్యెడిని. అన్వయకాఠిన్యమును గలదు. పైనిచెప్పఁబడిన మువ్వురుకవులును బురాణశైలికి నెంతయుఁ దగియున్నారు. వీరికాలంబునం గలకవులచేఁ బురాణంబు లన్నియు నించుమించుగఁ దెనిఁగింపఁబడియెను. హరివంశము నాచనసోమునిచేతనుగూడఁ దెనిఁగింపఁబడియెను. ఆతఁడును బదలాలిత్యంబునకును జాతీయకవనంబునకును బ్రసిద్ధుఁడే. ఈపైని జెప్పిన కవులకల్పనలంగూర్చి పోతనామాత్యునికథలో నింకను గొంత వ్రాయఁబడును. రెండవయెఱ్ఱనకవికవిత్వము మృధుమధుర మైనది.

భారత పర్యాయనామ గ్రంథకర్తలు.

ఇదివఱలో మనము భారతనామంబున నొప్పునట్టిదియు, దాని కనుబంధమై భారతశేషమై హరివంశనామమున నొప్పునట్టిదియునగు గ్రంథమును రచియించినకవులంగూర్చియును వారితో సంబంధించిన కవులంగూర్చియు వ్రాసియున్నారము. ఇఁకముందు "జైమినిభారతము,