పుట:Kavijeevithamulu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

కవి జీవితములు



వంశము తెనిఁగించుటకుఁగా నేర్పఱుచుకొని దానిని పూర్తిచేసినపిమ్మట భారతములోఁ గొంతభాగము మాత్రము సంపూర్తి కాకయుండుట బాగు గా దని దానిఁగూడఁ బూర్తి చేసినట్లు కానుపించును. కాని యట్టిసందర్భము దీనిలో వ్రాయఁబడి యుండలేదు. నన్న యభట్టు ప్రారంభించిన శరదృతువర్ణననే తానును మఱికొన్ని పద్యములతోఁ జెప్పి గ్రంథ మంతయు నన్న యభట్టు రచియించినట్లే రాజనరేంద్రునిపైఁ గృతియుంచి పూర్తి యొనరించె. నన్న యభట్టుకవిత్వమునకును శంభుదాసునికవిత్వమునకుం గలశయ్యా భేదంబు సూచించుటకుఁ గాను శంభుదాసుని శరదృతువర్ణనలోనియొకటిరెండుపద్యముల నిటవివరిం చెదను. ఎట్లన్నను :-

చ. స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిర స్తనీరదా
   వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
   ద్ధురతరహంససారసమధువ్రతనిస్స్వనముల్ సెలంగఁగాఁ
   గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్.

శా. ధానాంభఃపటలంబునం బృథుపయోధారావలిం దాల్చి గ
   ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁబ్రచ్ఛాదించి ప్రావృట్పయో
   దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ
   గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్ వనాంతంబునన్.

ఆరణ్యపర్వాంతమున శంభుదాసుఁడు తా నీగ్రంథరచనఁ జేయుటకుఁ గలకారణము నొకపద్యములో రచియించెను. దాని నిచ్చోట వివరించెదను. ఎట్లన్నను :-

సీ. భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు, శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
   సంతతధ్యానసంసక్త చిత్తుఁడు సూర, నార్యునకును బోతమాంబికకును
   నందనుం డిలఁ బాక వాఁటిలో నీలకంఠేశ్వరస్థాన మై యెసకమెసఁగు
   గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పుధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ

గీ. డెఱ్ఱనార్యుఁడు సకలలోకైకవిదితుఁ, డైననన్న యభట్టమహాకవీంద్రు
   సరససారస్వతాంశప్రశస్తి దన్నుఁ, జెందుటయు సాధుజనహర్ష సిద్ధి గోరి.

క. ధీరవిచారుఁడు తత్కవి, తారీతియుఁ గొంత దోఁపఁ దద్రచనయ కా
   నారణ్యపర్వశేషము పూరించెఁ గవీంద్రకర్ణపుట పేయము గాన్.