పుట:Kavijeevithamulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథములో వేఱుగ నొకతావున సాధ్యమగునంతవఱకుఁ జేర్చుచున్నాఁడను. అటులనే కాలనిర్ణయము చేయునపుడును దానికి నొకశీర్షిక నిచ్చి వేఱుగనే చేర్చు చున్నాఁడను ఇట్టిసంగతు లన్నియు గ్రంథము చూచినంగాని గోచరములు కావు. పైసంగతు లన్నియు నట్లుండగాఁ దెలుఁగు దేశపుపండితుల నందఱ నొకసంగతి బ్రార్థించుచున్నాఁడను. అది యెద్దిఁయనఁగా భాష యొకరిసొమ్ము గాదు. అటులనే చారిత్రమును. ఇంతియ కాక యిదియొక దేశములోనిదియుం గాదు. గ్రంథానుకూల మైనగాథ లాంధ్రదేశములో నాల్గుతెఱఁగుల నుండువానిఁ గైకొని యిందుఁ బొందుపఱుచుచున్నాఁడను. అట్టివానిలో భేదములుగాని యపసిద్ధాంతములు గాని వచ్చినప్పుడు పండితులు వానిని దెల్పి యదివఱ కొకవేషము వేసికొని గ్రంథమును వినుపించుచున్న చారిత్రకారునిచేతనే దానిని సవరణ చేయించి యతని మర్యాదనునిల్పి యతనికృతజ్ఞతాసూచకము లగువందనముల నందుట మంచిది గదా! కావున నిఁక ముందు ప్రకటింపఁబోవు చారిత్రములకుఁ గానీ కవిచరిత్రములకుఁ గానీ చరిత్రాభిమాను లందఱును నేను బ్రార్థించువిధముననే సహాయము చేసెదరని నమ్మి యున్నాఁడను. అని యిటుల వ్రాయుట కవితాధర్మముం దెల్పుటకుఁగాని పూర్వ పక్షి సేయునాక్షేపణకు జంకి కాదు. అట్టిపూర్వపక్షులమత ఖండనము సేయుచోఁ గొంకు కలలోనను లే దని గ్రంథము చూచినవారికే స్పష్టము కాఁగలదు. అయినను గ్రొత్తమార్గముం జూపుట కెవ్వరైనఁ బ్రయత్నించునపుడు విద్వాంసులు దానిలోనిగుణదోషములఁ దెలిసి దానిని గాపాడుట వారికి సహజధర్మ మని విన్నవించుచున్నాఁడను.

"శ్లో. సామాన్యో౽యం ధర్మసేతు ర్నృపాణాం కాలే కాలే పాలనీయో భవద్భిః,
    సర్వానేవం భావినః పార్థివేన్ద్రాన్, భూయో భూయో యాచతే రామచన్ద్రః."

అని శ్రీరామచంద్రు నంతవాఁడును నీవిధమునఁ దాఁ జేసిన యొక కార్యమును బరిపాలింపవలయు నని ప్రార్థించుచుండ నిఁక నాయట్టికించిజ్ఞానిచే నిట్టిసహాయము ప్రార్థింపఁబడుట కేమియబ్బురము ? కావున నాంధ్రపండితు లీశ్లోకమును బాటించి నన్ను గరుణింతురుగాక.[1]

ఇట్లు, విన్నవించు చరిత్రకారుఁడు

గురుజాడ శ్రీరామమూర్తి.

విజయనగరము.

1. 2. 1893.

  1. ఇది గ్రంథకర్త యొకప్పు డిందలియొక భాగమును బ్రకటించుతఱిఁ జేసినవిజ్ఞప్తి.