పుట:Kavijeevithamulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

95



కోర్కెపైని బౌద్ధమునులతో సోమయాజి సంవాదము చేసి యుండెననియును నీవఱకుఁ జెప్పియుంటిమి. గణపతిరుద్రుఁడు శా. సం. 1057 మొదలు 1085 వఱకును రాజ్యము చేసినట్లు సోమదేవరాజీయ వచనకావ్యమువలనం గాన్పించును. కావున సోమయాజియు నాకాలమువాఁడే యని నిశ్చయింపవలయును. తిక్కనసోమయాజి గణపతి రాజుం జూడఁబోవునప్పటికే భారతముం దెనిఁగించినట్లును, భారతార్థము లతనిసభలో నుపన్యసించినట్లును కానుపించును. సోమయాజి శివదేవయ్య యనుమంత్రియొక్కగుణవిశేషములు గణపతిరాజునకు బోధించిన ట్లుండుటచేతను, అతనిమూలముగనే రాజకీయవ్యవహార మంతయు నడిపింపు మని సోమయాజి లెస్స చెప్పుటచేతను గణపతిదేవుఁ డప్పుడే సింహాసనమునకు వచ్చి యున్నట్లును, అప్పటికే అనఁగా శా. సం. 1057 నకే సోమయాజి భారతముం దెనిఁగించినట్లును స్పష్ట మగుచున్నది. ఇట్టిమనయూహలు పైనుదాహరించినకాలముతో సరిపడి యుండుటంబట్టి న్యాయ్య మగునవిగానే కానుపించుచున్నవి.

3. కాకతీయగణపతి రాజుమంత్రులతో నొక్కం డగువాణనవంశపు కన్న మంత్రి వసిష్ఠ రామాయణకవి యగుసింగనకవివలనఁ బద్మపురాణోత్తరఖండముం గృతి నందినకందనమంత్రికి నాఱవపురుషుఁడు. వసిష్ఠ రామాయణకవి యైన సింగనమంత్రి తిక్కనసోమయాజికి నైదవ పురుషుఁడు. కాఁబట్టి తిక్కన సోమయాజియును కాకతీయగణపతిరాజును సమ కాలీను లని చెప్పుట కేయా క్షేపణయును లేదు. సోమదేవ రాజీయమను వచన పద్య కావ్యములరెంటికిని ప్రారంభము మొద లొకవందసంవత్సరములు వ్యత్యాసము గాన్పించును. ఆవ్యత్యాసముంగూర్చి కాకతీయరాజవంశచారిత్రములో నాచేత సవిస్తరముగ సంవాదింపఁబడినది గావున నిపు డది యంతయు నీకవిజీవితములలో వ్రాయఁబడక వచన కావ్యములోఁ జెప్పఁబడిన గణపతిరాజు కాలమే సరియైనది యనియును, దానికి నీదృష్టాంతమునే చూపి యుంటి ననియుఁ దెలియఁజేయుచున్నాఁడను.