పుట:Kavijeevithamulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

91



కుమారుఁడు పదమూఁడవశతాబ్దమున నున్నట్లు చెప్పినను తిక్కన దానింబట్టి అతనికి నతిసమీప్య కాలీనుఁ డని యూహింపఁ జాలి యుండదు. సోమయాజితండ్రికి సోమయాజి అతి బాల్యంబునం బుట్టి యుండవచ్చును. అతనితమ్ముఁడు సవతితమ్ముఁ డై తండ్రి వృద్ధావస్థలోఁ గల్గి యుండవచ్చును. ఈయిర్వురకును నలుబదిసంవత్సరములవఱకును వ్యవధి యుండవచ్చును. అట్టితిక్కనసోమయాజితమ్మునకు మరల నైదవపదిలోనో లేక ఆఱవదిలోనో పుట్టియున్న తిక్కనమంత్రి అతని యఱువదవసంవత్సరమున యుద్ధములో హతుఁ డయి యుండవచ్చును. అట్లైనఁ దిక్కనమంత్రిమృతినాఁటికిఁ దిక్కనసోమయాజి జననకాలము నూటయేఁబదిసంవత్సరములకు ముందు గాకున్న నూఱుసంవత్సరములవఱకైన నై యుండును. రెండవపక్షములోఁగూడ నిది శా. సం. 1030 అంతకుఁ బూర్వము అగు ననుటకు సందియ ముండదు. కాని యీపైవృత్తాంత మంతయు నూహలపైని చేసిన సిద్ధాంతమునకు నట్లుగనే యూహించి యియ్యఁబడిన సమాధానముగా నగును. తిక్కనసోమయాజికిఁ దమ్ముఁ డున్నాఁ డని సోమయాజికృతగ్రంథములలోఁ జెప్పఁబడి యుండలేదు. ఇట్లుగాఁ జెప్పఁబడకపోవుటంబట్టి సోమయాజితండ్రికి సోమయాజి యొక్కఁడే కుమారుఁ డని నిశ్చయింపవలసి యున్నది. తిక్కన మంత్రినాముఁడు కాక దండనాథనాముఁడు వీరివంశములో నొక్కఁ డున్నట్లు గ్రంథము లున్నవి. అతనికే రణతిక్కన యని వాడుక. ఇతనితండ్రి సిద్ధయ. ఈసిద్ధయ సోమయాజికి మూఁడవ పెత్తండ్రి. సిద్ధయకుమారుం డగురణతిక్కన ముప్పదియిద్దఱునియోగులలోఁ జెప్పఁబడిన వాఁడును, వేములవాడభీమకవి కాలములోనివాఁడు నైనట్లు నీవఱకే యాభీమకవిచారిత్రములోఁ జెప్పఁబడియెను. ఇఁకఁ దిక్కనతమ్మునికుమారుం డగుతిక్కనమంత్రి యున్నట్లు ప్రామాణిక గ్రంథములు లేవు గావున దీనింబట్టి తిక్కనసోమయాజికాలము నిర్ణయింపము. ఇది నిర్ణయము కాలేదు గావునఁ దిక్కనమంత్రికిఁ బ్రభుఁడుగానుండినసిద్ధిరాజు తిక్కనసోమయాజులవలన నుత్తర