పుట:Kavijeevithamulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కవి జీవితములు



నిర్వచనోత్తరరామాయణముంగూర్చి రామాయణకవులచారిత్రములోఁ జూడఁదగును.

తిక్కనసోమయాజికాలనిర్ణయవిమర్శనము.

ఇదివఱలోఁదిక్కనసోమయాజికాలనిర్ణయము చేయుటకుఁగాను ఆంధ్రకవులచారిత్రములోఁ గొంతయత్నము చేయఁబడినది. కాని అది యొకస్థిరమార్గమును కనుపఱుపనందున నిం దా కాలనిర్ణయమును ముందు విమర్శించి అనంతరము దాని నెట్లు సిద్ధాంతీకరింపవలయునో తెలియఁజేసెదను. అది యెట్లన్నను :-

1. ఆంధ్రకవిచారిత్రములో "కృష్ణామండలచారిత్రములో నెఱ్ఱగడ్డరా జగుకాటమరాజును, పల్నాటిప్రభు నైనపద్మానాయకుఁడును, గలిసి పశువులబీళ్లకుఁగాను పదుమూఁడవశతాబ్దమందు నెల్లూరిప్రభు వైన సిద్ధిరాజుతో యుద్ధము చేసినట్లును, సిద్ధిరాజుసేనలు కవితిక్కనతమ్మునికుమారుం డగుతిక్కనమంత్రిచే నడిపింపఁ బడినట్లును" జెప్పంబడి యున్నది. దీనింబట్టి చూడఁగా సోమయాజితమ్మునికుమారుఁడు పదుమూఁడవశతాబ్దములోని వాఁడు కాని సోమయాజి పదమూఁడవశతాబ్దములోనివాఁడు కాఁ డని తేలినది. 1200 ల సంవత్సరము మొదలు 1300 ల సంవత్సరమువఱకును పదమూఁడవశతాబ్ద మగును. సోమయాజతమ్ముని కుమారుఁడు 1150 కల కాలములోఁ బుట్టి 1201 వఱకు ననఁగా 50 సంవత్సరములవఱకును జీవించియున్నను పదమూఁడవ శతాబ్దములోఁ జరిగెడుయుద్ధములో నుండవచ్చును. ఆయుద్ధములోనే హతుఁడైన నతఁడు పదమూఁడవశతాబ్దములో యుద్ధములో హతుఁ డయ్యె నని చెప్పఁ బడవచ్చును. ఇతఁ డేఁబదిసంవత్సరములవాఁ డని యొక యూహం జేసినారము. అంతకుఁ దక్కువవయస్సులో నుండువారికిఁ బూర్వకాలములో నున్నతోద్యోగములు దొరకెడునాచారము లేదు. ఏఁబదిసంవత్సరములవయస్సునకుఁ బైవాఁడే అయ్యెనేని అతనిజననకాలము 1130 లేక, 1140 కూఁడఁ గావచ్చును. ఇదికాక తిక్కనసోమయాజితమ్ముని