పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

30

"యతి కృతి కధిక శ్రావ్యంబై బెడంగుగా నిడవలయున్” అని భీమన చెప్పినాఁడు. తొలుత వళియుఁ బ్రాసముఁగూడ శబ్దాలంకారములుగానే ప్రయోగింపఁబడి క్రమముగాఁ బద్యలక్షణములుగా మాఱినట్లు తోఁచుచున్నది. కన్నడమందు యతి లేదు గాని ప్రాస మున్నది ప్రాసమువలనఁ బద్యమునకు శోభవచ్చునని నాగవర్మ యిట్లు చెప్పెను.

క. నుతశబ్దాలంకారదొ
   ళతిశయమదుకన్నడక్కె సతతంప్రాసం
   కృతకృత్య మప్పుదెల్లర
   మతదిందదుత ప్పెకావ్యమేంశోభిపుదో ! (ఛందోంబుధి)

తెనుఁగులోని యతివంటియతి యఱవములో నున్నదఁట, ఆ భాషలో దానికి “మోనై "యనిపేరు. కన్నడములో నేవిధమైన యతియులేదు. కర్ణాటాంధ్రభాషల క నేకవిషయములలో నత్యంతసంబంధము కలదు. వీనికి యతివిషయములో నింతభేదమేలకలిగెనో యుభయభాషా వేదులు నిర్ణయింతురుగాక ,

సంస్కృతములోఁ బదియవదియగు పంక్తిచ్ఛందము మొదలుకొనియే విశ్రమము విధింపఁబడినది. మొదటి తొమ్మిది ఛందస్సులలోఁ బుట్టినవృత్తములు చిన్నవిగావునఁ బాదమధ్యమందు విశ్రమస్థాన మనావశ్యకమని గ్రహించునది. ఈమర్యాదనేయాంధ్రకవులు నవలంబించిరి. వృత్తములకు సంస్కృతములో నెచ్చట నెచ్చట విశ్రమమో తెలుఁగునఁగూడ నచ్చటనే విధింపబడినది,