Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

కవిజనాశ్రయము

“అధాతు నామభేదేన విరమో విరతి ర్యతిః
 స్వరసంధ్యాప్తసౌందర్యా త్తద్భే దేపీప్యతే క్వచిత్.”

అనఁగా సాధారణముగా ధాతుమధ్యమందును బ్రాతిపదికమునడుమను విరతి యుండదు. స్వరసంధివలనఁ జెవికింపుగలు గనప్పు డొకానొకచోట నీవిధికి భిన్నముగా యతి యుండిన నుండవచ్చు నని తాత్పర్యము. మహాకవుల కావ్యములలోఁగూడ నచ్చటచ్చట యతిభంగము కన్పట్టుచున్నది. ఉదాహరణము.

"యాచ్ఞాదైన్యపరాంచి యస్య కలహాయంతే మిథ స్త్వంవృణు
 త్వం వృణ్విత్యభితో ముఖాని స దశగ్రీవః కథం కథ్యతామ్.”

అనర్ఘ రాఘవనాటకము.

తెలుఁగులో వళియనఁగాఁ బాదాద్యక్షరమునకు సవర్ణమైన యక్షరము వచ్చుటయే. తుల్యాస్యప్రయత్నము లగువర్ణములు సవర్ణములు. సవర్ణము పదాదియందైనను రావచ్చును. పదమధ్యమందైనను రావచ్చును. పదాదియం దున్నప్పుడు పద్య మధిక శ్రావ్యముగా నుండుననుటకు సందేహములేదు. నన్నయభట్టు, బమ్మెర పోతరాజు మొదలగు కొందఱు మహాకవుల గ్రంథములలో నిట్టియతు లధికముగా నున్నవి. తిక్కనసోమయాజి కవిత్వములోఁ దఱచుగా యతి పదమధ్యమందే యుండును. మహాకవు లెందునకును సమర్థులే, కాని, సామాన్యకవులు యతిస్థానమందుఁ బదచ్ఛేదము చేయవలయునన్న ననావశ్యకశబ్దము లనేకములు ప్రయోగింపవలసివచ్చును. కవిత్వ మిమిడికగానుండదు.