పీఠిక
28
మునకు మూఁడుగణములు. తరువాతివానికిఁ గ్రమముగా నాక్కొక్క గణ మధికము. ఈయక్కరలకుఁ గన్నడములో, కిఱియక్కర, ఎడెయక్కర, నడువణక్కర, దొరెయక్కర, పిరియక్కర యనిపేళ్లు. తెలుఁగులో మధ్యాక్కర యనునది కన్నడములో దొరెయక్కరమైనది. దొరెయన సమాన మని యర్థము. ఈయక్కరలో భాగమునకు రెండేసి యింద్రగణములు నొక సూర్యగణము చొప్పున ప్రతిపాదమును రెండు సమానభాగములుగా విభజింపవచ్చును గాన దీనికి సమానాక్కర యను పేరును, బాదమున కై దేసి గణములుగల యక్కర గణసంఖ్యచే నైదక్కరలకు మధ్యస్థానముననుండుటచే మధ్యాక్కర మను పేరును నన్వర్ధములుగా నున్నవి.
- యతి. -
యతిపర్యాయపదములలో వడి యనునది తెలుఁగు, దానివ్యుత్పత్తి యూహ్యము. తక్కినపదములు సంస్కృతచ్ఛందశ్శాస్త్రమునుండి గ్రహింపఁబడినవి. యతిస్వరూపవిషయములో సంస్కృతమునకును దెలుఁగునకును జాల భేద మున్నది. సంస్కృతమున యతియనఁగా విశ్రమించుస్థానము. అనఁగాఁ బద్యముచదువునపుడు గ్రుక్క విడుచుతా వని యర్థము. పదమధ్యమున గ్రుక్కవిడుచుట కనుకూలింపదు, గావున యతిస్థానమందుఁ బదము తెగిపోవలయును. కనుక యతియనఁ బదవిచ్ఛేదమని భావము. “యతి ర్విచ్ఛేదసంజ్ఞకః” యని వృత్తరత్నాకరము. ఈవిషయము పింగళసూత్రములలో నిట్లు చెప్పఁబడినది.