23
కవిజనాశ్రయము
ఛందశ్శాస్త్రమునకెల్ల మూలము. దీర్ఘాక్షరములును, “జడ్డక్కరముల బొట్టులపిఱుందకడనూఁదిన యక్కరములు"ను గురువులు. శేషించినవి లఘువులు. “ఊఁదిన” యను విశేషణసామర్థ్యమునఁ బదాదియందు సంయుక్తాక్షరముండి దానివెనుకనున్న భిన్నపదము చివర హ్రస్వాక్షర ముండినచో నాహ్రస్వాక్షరము లఘువే యని గ్రహింపవలయును. పూర్ణబిందువునకుఁ బూర్వమున్న యక్షరము లన్నియు నూఁది పలుకఁబడున ట్లూహించునది. “వారల్", "చెలఁగున్” ఇత్యాదిస్థలములయందుఁ బొల్లులతోఁ గూడినహ్రస్వాక్షరములు కూడ సంయుక్తాక్షరపూర్వవర్ణతుల్యములె యని గ్రహింపవలయును. సంస్కృతములోఁ బాదాంత మందలి లఘువుకూడ వికల్పముగా (అనఁగా వలసినప్పుడు) గురువగును. ఈశాస్త్రము కన్నడమందును గలదు, గాని, తెలుఁగులో నిరాకరింపఁబడినది. “ఒక్క మాత్ర లఘువై ద్విమాత్రకము గురు వయ్యె” నని సామాన్యముగాఁ జెప్పినాఁడు, గాని, యీలక్షణము సర్వత్ర వర్తింపదు. లఘు వెప్పుడు నొక్క మాత్రమే యగును, గాని, గురువు రెండుమాత్రలకంటె నెక్కువగాఁ గాని తక్కువగాఁ గాని యుండవచ్చును. వ్యంజన మర్థమాత్ర యను న్యాయముచే “వనితన్" అనునప్పుడు "తన్" అను గురువు సార్థమాత్రక మగును. “అనఁగాన్” అనుచో “గాన్” అను గురువు సార్ధద్విమాత్రక మగును. ప్లుతస్వరములో మూఁడుమాత్ర లున్నవి. కావున నొక్క మాత్ర గలయక్షరము లఘు వనియు నంతకంటె నధికము గల యక్షరములు గురువు లనియుఁ జెప్పనొప్పును.