పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

కవిజనాశ్రయము

అను పద్యములను గవి యుదాహరించియున్నాఁడు. దీనిని బట్టి వేములవాడ భీమకవి కావ్యాలంకారచూడామణిని గృతి నందిన విశ్వేశ్వరరాజు కాలములోనో తరువాతనో యుండి యుండవలె” నని వీరేశలింగము పంతులుగారు వేఱొకహేతువు చెప్పినారు.

ఈలక్షణము లక్ష్యముఁగూడఁ గావ్యాలంకార చూడామణిలోనివి గాని కవిజనాశ్రయములోనివి కావు. కావ్యాలంకారచూడామణి యచ్చుప్రతిలో నీపద్యము లాదేశవళికి లక్షణలక్ష్యములుగా నున్నవి. కవిజనాశ్రయమునం దాదేశవళి చెప్పఁబడలేదు. కవిజనాశ్రయము లిఖతప్రతులు కొన్నింటిలో నీపద్యములు దూర్పఁబడి యుండవచ్చును. అట్లయినచో నవి ప్రక్షిప్తములు. కవి లక్ష్యలక్షణములు రెంటిని దానేచెప్పెను గాని యితరులు రచించిన పద్యముల లక్ష్యములుగాఁ దెచ్చికొనియుండలేదు. "వికటకవులు కొన్నివింతలు గల్పించి, కవిజనాశ్రయమునఁగలపినా”రని యప్పకవి వ్రాసినది యథార్థము. ఈయనర్థము ప్రాచీనగ్రంథముల కన్నిటికిం బట్టినదియే. చక్కఁగా శోధించి ప్రక్షిప్తముల నిరాకరించు భారము విమర్శకుల యం దున్నది. ఈహేతువులం బట్టి వీరేశలింగముపంతులుగారు చేసిన కాలనిర్ణయము కూడఁ ద్యాజ్యమే.

భీమన కాలమును నిర్ణయించుట కాతఁడు కళింగగంగు రాజునాస్థానమునం దుండె నని తెలుపు రెండు చాటుపద్యములు ముఖ్యాధారములుగ నున్నవి. ఆపద్యము లెవ్వియన:--