3
కవిజనాశ్రయము
గ. పరిషత్సంఖ్య 164. ఈ సంపుటములో 1 ఆనందరం గరాట్ఛందము, 2 కవిజనాశ్రయము, 3 నానార్థ నిఘంటువు గలవు. కవిజనాశ్రయము మంగళ మహాశ్రీవృత్తమువఱకు నున్నది.
జ. పరిషత్సంఖ్య 257. ఈసంపుటములో నరసభూపాలీయము, కవిజనాశ్రయము నున్నవి. మిక్కిలి ప్రాఁతప్రతి. మత్తకోకిలవఱకు నున్నది. ఈగ్రంథము భీమకవిరచించినట్లున్న యవతారిక యీప్రతియందు మాత్రమే యున్నది. తొట్టియం బాలసుబ్రహ్మణ్యముగా రిచ్చినది.
డ. పరిషత్సంఖ్య 391. ఈపుస్తకములో 1 ఆంధ్రనామ సంగ్రహము. 2. ఆంధ్రభాషాభూషణము, 3. కవిజనాశ్రయము, 4 అనంతునిఛందస్సు, 5 దేశి తెనుఁగుమఱుఁగులు, 6 నానార్థనిఘంటువు, 7 రేఫఱకారనిర్ణయము, 8 కవిచింతామణి యను గ్రంథము లున్నవి. కవిజనాశ్రయ మసంపూర్తిగా నున్నది. వృత్తపాదములకుఁ బ్రస్తారక్రమము చూపఁబడినది.
ద. సి. పి. బ్రౌనుగారు వ్రాయించిన కాగితపుఁబ్రతి. దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము లో నున్నది. అసంపూర్ణము. ఈ ప్రతి బ్రౌనుగారి యొద్దనుండిన పండితులచే సంస్కరింపఁబడియున్నది.