Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోషాధికారము.

85

క. ఈతఁడు “నృపస్య నగరం
   యాతి” యనం జనిన సుప్తిజంతంబులు, "కృ
   త్వా తీర్త్వా జిత్వా" యన
   బ్రాఁతిగ నీక్రియలు చొరవు [1]భాషాకృతులన్. 24

క. వితతసుకవివాక్యం బవ
   గతమై 'కవయె వదంతి కావ్యం' బని స
   త్కృతి నీక్రియఁ బెట్టించిన
   నతిశయమై యుండు సుప్తిజంతం బయ్యున్. 25

క. ఇవి మొదలగునొడువు లనే
   కవిధగ్రామ్యోక్తు లెన్ని కల వన్నియు స
   త్కవు లపశబ్దము లని త
   త్కవితల మెచ్చరు కవీంద్రకల్పమహీజా ! 26

క. శ్రీ దేవీపతి రేచఁడు
   గాదిలియై చనఁగ దేశకాలకళాలో
   కాదివిరోధస్థితుల స
   మాదరమునఁ దెలియఁ జెప్పు నఖిలజనులకున్. 27

క. కలహంసలు క్రొమ్మామిడి
   తలిరులలోఁ గోకిలాళి తామరవిరిపు
   వ్వులలో నాడెడు ననును
   క్తులు దేశవిరోధనామదోషము లయ్యెన్. 28


  1. ఇచ్చట భాష యనఁగా సంస్కృతముకంటె భిన్న మయినదేశభాష. ఈశబ్ద మీయర్థమం దుత్తరదేశ మందు వ్యవహరింపఁబడుచున్నది.