92
కథలు గాథలు
ఆక్రమించాలని సంకల్పించి ఈవిషయంలో తనకు సహాయం చేయవలసినదని అప్పట్లో పుదుచేరి ప్రాంతాలలో బలవంతులుగానున్న ఫ్రెంచి వర్తక కంపెనీవారిని ఆశ్రయించారు. అప్పుడు మహమ్మదాలీ సహజంగా, ఫ్రెంచివారికి పోటీగానున్న ఇంగ్లీషు వర్తక కంపెనీవారిని ఆశ్రయించారు. అంతట ఈ కర్నాటక రాజ్యసింహాసనం కోసం యుద్ధాలు ప్రారంభమైనవి. ఆయుద్ధాలలో ఇంగ్లీషువారు జయించడంలో మహమ్మదాలీ రాజ్యాధికారం స్థిరపడింది. అతడు ఇంగ్లీషువారికి వశుడై వారిచేతులలో కీలుబొమ్మయై వా రెలాగ చెబితే అలాగ వినవలసి వచ్చినది. కర్నాటక రాజ్యానికి మహమ్మదాలీ పేరునకు నవాబుగా నున్నాడు గాని నిజమైన ప్రభుత్వాధికారాలన్నీ ఇంగ్లీషువారే చలాయించడం ప్రారంభించారు. యుద్ధాలలో సహాయం చేసినందుకు సాలుకు ఏడులక్షల వరహాలు నవాబు కంపెనీవారి కివ్వాలని అది చెల్లించడానికి సొమ్ములేక నవాబు ఋణాలు చేయవలసివచ్చింది.
కర్నాటక నవాబు మొదట ఆర్కాటును రాజధానిగా చేసుకొని యున్నందువల్ల ఆయనను ఆర్కాటు నవాబు అనికూడా అనేవారు. తరువాత అతడు చెన్నపట్నంచేరి ఒక దివ్యభవనంలో కాపురంవుంటూ వచ్చాడు. అతడు తనభోగవిలాసాలకోసమూ, ఇంగ్లీషు అధికారులను మెప్పించడముకోసమూ దుర్వ్యయం చెయ్యడం ప్రారంభించాడు.కంపెనీ ఉద్యోగులకు బహుమతులూ, లంచాలూ విరివిగా నిచ్చేవాడు. చాలా మంది దొరలకు ఉద్యోగాలిచ్చి తనవద్ద వుంచుకొనేవాడు. 1758-1780 మధ్య అతని అతిధ్యమునుబొందిన దొరలూ దొరసానులూ అతని దర్బారువైభవమును, భోగవిలాసాలను, దుబారాఖర్చును చిత్రచిత్రాలుగా వర్ణించి యున్నారు. ఆర్కాటునవాబు యొక్క రాజ్యాధికారము కేవలమూ ఇంగ్లీషువారి దయాధర్మాలపైననే ఆధాపడి వున్నందువల్ల ఏదో నెపంమీద చీటికీ మాటికీ కంపెనీ అధికారులు అతనిని సొమ్ము ఇవ్వవలసిన దని పీడించేవారు. కొందరు ఉద్యోగులు అతనిని నయాన భయాన సొమ్ము తెమ్మని బలవంతపెట్టేవారు. కొందరు అతనికి సహాయం చేస్తామని మోసగించి సొమ్ము కాజేసేవారు. ఇన్ని