పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. మన ముసల్మానులు భారతీయులు కారా?.

మన తెలుగు దేశంలో మహమ్మదీయులను 'తురక' లని వ్యవహ రించడం అలవాటు అయింది. ఎవరు మీరని వారిని అడిగితే మేము 'తురక'లమంటారు గాని నిజంగా వీరు తురుష్క దేశాన్నుంచి వచ్చిన విజాతీయులు కారు. ఒక్క ఆంధ్ర దేశంలోనే కాదు; యావద్భారత దేశంలో ఉన్న ముసల్మానులలో నూటికి తొంభై మంది పూర్వము హిందువులలోనుంచి మహమ్మదీయ మతంలో కలిసిన వారి సంతతి వారే. నూటికి పదిమంది మాత్రమే అరబ్బీ తురుష్క దేశాలనుంచీ, పారశీక ఆఫ్ఘనిస్థానాలనుంచీ వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకొని ‘షేకు ' లనే ఈ దేశపు మహమ్మదీయులతో సంబంధ బాంధవ్యాలు చేసిన వారి సంతతి వాళ్లు. ఈ ముసల్మానులు హిందూప్రజల లాగనే గ్రామాలలో వ్యవ సాయము, ఇతర వృత్తులు చేసుకుంటూ జీవనం చేస్తూ వున్నందువల్ల అరబ్బీ తురుష్క పారశీక మతాచారాలు క్రమక్రమంగా సడలిపోయి హిందూ దేశ ప్రజల ఆచారాలే వారికికూడాఅలవడినవి. ఇస్లాము మతంలో కుల భేదాలకు తావులేక పోయినా మన దేశంలో వున్న మహమ్మదీయులలో వడ్లగింజలలో వున్నన్ని భేదాలు ఏర్పడినవి. హిందువులలోనుంచి మహమ్మదీయమతం అవలంబించిన వారు వేరు వేరు కులాచారాలు అవలంబించి వేరు వేరు తెగలుగా ఏర్పడ్డారు. ఇస్లాము ధర్మాన్ని బట్టి మహమ్మదీయు లందరూ ఏకపంక్తిని భోజనము చేయవలసి యున్నా మన ముసల్మానులలో భోజన ప్రతిభోజనాల విషయంలోనూ, వివాహాల విషయంలోనూ నిషిద్ధాలు ఏర్పడినవి. వంగరాష్ట్రం జనసంఖ్యలో నూటికి యాభై మంది మహమ్మ దీయులే. వీరిలో నూటికి 34 మంది వ్యవసాయికులు. వీరందరూ హిందువులలోనుంచి మహమ్మదీయు లైనవారే. ఘూర్జర రాష్ట్రంలోని ఖోజాలు, మెమనులు, బోరాలు హిందువుల సంతతివారే. వీరిప్పటికీ