Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రపత్రికా పాఠకులకు ' కథలు-గాథలు ' అనే శీర్షిక చిరపరిచితమైనదే. అప్పుడప్పుడు భారతిలోను గడచిన ఒకటిన్నర సంవత్సరములనుంచి ఆంధ్రపత్రిక ఆదివారము సంచికలోను నేను వ్రాస్తు వచ్చిన చరిత్రాత్మకమైన కథలలోను గాథలలోను కొన్నిటిని తీసి కొద్ది మార్పులతో ఇప్పు డీరూపంగా ప్రకటిస్తున్నాను.

ఈ కథలలోను గాథలలోను చిత్రవిచిత్రములైన సంగతులు వింతలు-విశేషాలు కనపడుతూవున్నా ఇవి కల్పనా కథలుగాని పుక్కిటి పురాణాలుగాని కావు. నిజంగా జరిగిన సంగతులు, చరిత్రాంశాలే. చరిత్రాధారముగాని, గ్రంథప్రమానములుగాని లేని అంశమిందులో ఒక్కటైనా లేదు.

ఇది నిజమా ? కేవలము కల్పనమేనా ? అని అనుమానం కలిగేటంత చిత్ర విచిత్రములైన చరిత్రాంశాలున్నవి. ప్రపంచములో ఇలాంటి వాళ్లుంటారా ? అని ముక్కుమీద వ్రేలువేసుకొని ఆశ్చర్యపడేటంట విపరీత చిత్తవృత్తులు గల స్త్రీ పురుషులున్నారు. నిజంగా జరిగిన సంగతుల ముందర ఒక్కొకప్పుడు కల్పనాకథలు, నవలలు, సినిమా చిత్రాలుకూడా తీసికట్టుగా నుంటవి.

కొన్ని చరిత్రగ్రంథాలలోను జీవిత చరిత్రలలోను దినచర్యలు, జాబులు, యాత్రావృత్తాంతాలు, అనుభవాలు (Reminiscences) జ్ఞాపకాలు మొదలైనవాటిలోను రచ్చకెక్కిన వ్యవహారాలలోను ఇంకా ఇతర గ్రంథాలలోను నాకు కనబడిన రసవంతములైన ఘట్టములే ఈ కథలు-గాథలు. పెద్ద పెద్ద గ్రంథాలయాలలో మూలపడివున్న పాత పుస్తకాల బూజు దులిపి చదివినకొద్దీ ఇలాంటివి కనపడుతూనే ఉంటాయి.

భారతదేశ చరిత్రకూ, భారతీయ ప్రజాజీవనానికీ సంబంధించిన చరిత్రాత్మకమైన కథలను, గాథలను, చరిత్రాంశాలను కొన్నిటిని మచ్చుచూపించడమే ఈ సంపుటం యొక్క ముఖ్యోద్దేశం.

బెజవాడ.