6. సీతారాముల శాపము
"దేవాలయాలలోని విగ్రహాల నగలను ముట్టుకుంటే ఘోరమైన శాపం తగులుతుంది. ఆ పాపఫలాన్నీ వంశపారంపర్యా అనుభవించవలసివస్తుంది." అని భారతదేశాన్ని ఏలే మొగలుచక్రవర్తి టెవర్నియరు అనే ఫ్రెంచి దేశీయుడితో అన్నాడట. ఈ మాట టెవర్నియరు విషయంలోనే రుజువు అయింది.
టెవర్నియరు 1638-68 మధ్య అయిదుసార్లు హిందూదేశానికి వచ్చి దేశమంతా తిరిగిచూశాడు. టెవర్నియరు వజ్రాల వ్యాపారం చేసి చాలా సొమ్ము ఆర్జించాడు. ఎక్కడనైనా అపూర్వమైన వజ్రం వున్నదంటే యెలాగైనా దాన్ని సంపాదించాలని ప్రయత్నించేవాడు. ఇతడు మొగలుచక్రవర్తి దయ సంపాదించి ఆయనతో వెళ్ళి హిమాలయ పర్వతాలలో వుండే వజ్రపు గనులు చూశాడు. అప్పుడు చక్రవర్తి టెవర్నియరుకొక మహావజ్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ సమయంలోనే చక్రవర్తి టెవర్నియరుకు బర్మా వజ్రం సంగతి ఇలాగని చెప్పాడు. "ఐరావతీ నదీతీరాన్నివున్న పగను అనే నగరంలో ఒక పురాతన దేవాలయంలో ఒక గొప్ప స్ఫటికంలో చెక్కిన సీతారాముల విగ్రహాలు వున్నాయి. ఆ విగ్రహాల మెడలలోను వక్షస్థలాల మీదను భక్తులు సమర్పించిన అనేక అమూల్య రత్నాల ఆభరణాలు వున్నాయి. వాటిలోకల్లా అందమైనదీ, అపూర్వమైనదీ ఒక వజ్రం వున్నది. అది రెండువేల సంవత్సరాల నుంచి ఆ విగ్రహాలకు అలంకారంగా వున్నది. దానిని పూర్వం బర్మారాజు కొమరితయైన బ్రిస్బన్ ధరించేది. ఆ పిల్ల ఆతతాయిలవల్ల బలవన్మరణము నందినది. దీని పూర్వచరిత్రను గురించి యింక ఏమీ తెలియదు." అని చక్రవర్తి చెప్పాడు.
వజ్రాపహరణం
ఈ మాట వినేటప్పటికి ఎలాగైనా ఆ వజ్రాన్ని అపహరించాలని టెవర్నియరుకు కోరిక కలిగింది. అతడు ముందుగా మండలేపట్నం వెళ్ళాడు. పగను చాలా దుర్గమమైన ప్రదేశంలో వుంది. అక్కడికి