పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కథలు గాథలు

ప్రాంతాలలోనే గట్టి ప్రచారం చేశాడు. అక్కడకూడా సనాతనులు వీరిని బాధించారు. అంతట మిషనరీలు అడవులలో కల్లరులనే అనాగరికుల గ్రామాలకు పోయి ప్రచారం సాగించారు.

నోబిలీ ఇలాగ మొత్తంమీద నలభై రెండేండ్లు ఈ మధుర జిల్లాలో క్రైస్తవమత ప్రచారం చేశాడు. అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. అతనిదృష్టితగ్గిపోయి గుడ్దివాడైపోతున్నాడు. ఈస్థితిలో కొంచెం చల్లని ప్రదేశానికి పంపితే అతనికి ఆరోగ్యంకలుగుతుందేమోనని 1948 ఆ ప్రాంతంలో మిషనరీ అధికారు లతనిని సింహళానికి పంపించారు. కాని అతడు అక్కడ విశ్రాంతి తీసుకునే దానికి బదులుగా తన మామూలు పద్దతి ప్రకారమే కఠిన నియమాలతో జీవిస్తూ మత ప్రచారం చేస్తూనే వచ్చినందువల్ల ఆరోగ్యం కలగలేదు. అక్కడ కూడా కొందరను అతడు మతంలోకలిపాడు. అందువల్ల అతడుమొదటి నుంచీ పనిచేస్తూవున్న ప్రదేశాలన్నిటికీ దూరంగావుండేటట్లు చెన్నపట్నంలో మైలాపూరికి విశ్రాంతికోసం పంపించారు. అక్కడ ఇతడు తన శిష్యులుగావున్న నలుగురు బ్రాహ్మణులతో ఒక చిన్న మట్టింట్లో కొన్నాళ్ళు కాలక్షేపంచేశాడు. ఇంతలో గోలకొండనవాబుల సేనాధిపతుల దండయాత్రలవల్ల చెన్నపట్నంలో రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలంగా వున్నందువల్ల అధికారులు మళ్లీ అతనిని ఇంకొకచోటికి మార్చారు. ఇట్టి స్థితిలో 1956 లో ఈ క్రైస్తవమతాచార్యులు స్వర్గస్థుడైనాడు.

నోబిలీ అరవంలో వ్రాసిన తొమ్మిది గొప్ప గ్రంధాల తాళపత్రసంపుటాలు 1990 లో కనబడ్డవి. (Madura District Manual (1868-J.H. Nelson, Part II pp 116-120, 127, 160-161 180-181)

                                     -----