పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగద్గురు తత్త్వబోధకస్వామి

65


విధానం వల్ల గర్విష్టులైన బ్రాహ్మణుల హృదయాలలో సంచలనం పుట్టించి వారిని ఆకర్షించాడు. అందువల్ల వా రీయనను చూడడానికి రావడం మాత్రమేగాక భగవంతుణ్ని గురించి ఆయన చెప్పే సంగతులను శ్రద్ధతో వినడము కూడా ప్రారంభించారు. అంతేకాదు. అందులో కొందరు భూమిమీద ప్రణమిల్లి ఆయన పాధధూళిని శిరస్సున ధరించేవారు. ఇంత బాగా తత్వబోధ చెయ్యగలవా డింకొకడు లేడని వేనోళ్లపొగిడేవారు! *(The Aravidu Dynasty. The Rev.H, Herss Chap XVIII pp. 362-396)

నోబిలీ వేసిన పధకం పారడానికి దారి ఏర్పడింది. అంతట అతడు హిందువులను బహిరంగంగా క్రైస్తవ మతంలో కలపడానికి ప్రయత్నించాడు. ఒక హిందూ మతగురువుతో నోబిలీ ఇరవైరోజులు- రోజుకైదారు గంటలచొప్పున శాస్త్రచర్చను వాదించి ఆఖరుకు తన సిద్దాంతాలను స్థాపించినట్లు జయభేరి వేయించి ఆగురువును క్రైస్తవమతంలో కలిపాడట. తనకు తెనుగుసంస్కృతములు నేర్పిన బ్రాహ్మణ గురువునుకూడా మతంలో కలిపాడు. అంతట ఒకరితరవాత ఒకరిని చలామందిని మతంలో కలపగలిగాడు. బ్రాహ్మణులు, రాజులు, రాజోద్యోగులు, శాస్త్రజులు, నాయకులు, గొప్పకులాలవారు, సంపన్నులు అతని దగ్గరికివచ్చి తరుణోపాయం చెప్పమని వేడుకొనేవారు. దేశంలో చాలా గొప్పవాడని ప్రఖ్యాతిజెంది విజయనగర చక్రవర్తుల వుద్యోగులలో పెద్దయైన దుంబిచ్చినాయకుడుకూడా ఈయనకు శిష్యుడు కావాలని కుతూహలపడ్డాడుగాని రాజుగారికి కోపంవస్తుందని వూరుకున్నాడు.

క్రైస్తవమతం అతిత్వరగా వ్యాపించింది. హిందూమతం కొద్దిరోజులలో నశిస్తుందా అని చాలామందికి తోచింది. దేశమంతా గగ్గోలుపుట్టింది. నోబిలీచేసిన ప్రచారంవల్ల బ్రాహ్మణ పురోహితుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. వ్రతాలు, పూజలు చేసే వారిచ్చే దక్షిణలు తగ్గిపోయినవి. హిందూ స్వాములవారికి ముడుపులుకూడా తగ్గిపోయినవి. అందువల్ల సనాతన ధర్మపరులందరూ కళ్లు తెరిచారు.