పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగద్గురు తత్త్వబోధ స్వామి

55

తన సోదర క్రైస్తవమిషనరీఫాదరీ అయిన ఫెర్నాండెజ్ తో సంబంధం లేకుండా తానొక కొత్తపంధాతొక్కి ఒక నూతన జీవితవిధానాన్ని ప్రారంభించాడు. ఇతడు మధురానగరంలోని బ్రాహ్మణుల దగ్గరికివెళ్ళి తాను పరంగీని కాననిన్నీ, పోర్చుగీసుజాతివాడనుకూడా కాననిన్నీ ఇటలీదేశానికి మకుటాయమనంగా వుండి ఒక పురాతన నాగరిక సామ్రాజ్యానికి రాజధానియైన రోమునగరంలో ఒక ఉత్తమ రాజవంశానికి చెందిన రాజకుమారుడననిన్నీ, తనకీప్రపంచంమీద రోత పుట్టివైరాగ్యంగలిగి సన్యసించితిననిన్నీ చెప్పి ఒక సన్యాసిలాగనే జీవించడం ప్రారంబించాడు. ఆ క్షణంనుంచి శూద్రసేవకుల నెవ్వరినీ తన దగ్గరికి రానివ్వక తన పరిచర్యల నిమిత్తం బ్రాహ్మణులనే నియోగించాడు. ఒక్కపూటమాత్రం ఇంత అన్నమూ, పాలూ, కూరగాయలూ పుచ్చుకుని నియమంగావుండేవాడు. బ్రాహ్కణ అగ్రహారమ్లో ఒక సంపన్నుని ఆశ్రయించి, కొంత స్థలం పుచ్చుకుని తన తోడ క్రైస్తవ మత ప్రచారకుడితో సంబంధంలేకుండా అక్కడ ఒక పూరి యిల్లు వేసుకుని అందులో నివసించడం ప్రారంభించాడు. ఈ యింటిని మధురానగ రాధికారే యిచ్చాడని ఫాదరు గుర్రెయిరో వ్రాశాడు.

"నోబిలీ బ్రాహ్మణ ఆచారాలన్నీ అవలంబించాడు.తన సపర్యల నిమిత్తం బ్రాహ్మణులనే నియో గించాడు. తాను రోమునగరాన్నుంచి వచ్చిన ఒక ద్విజుడ నని సన్యాసినని చెపుతూ అందుకనుగుణ్యముగా ఈదేశపు బ్రాహ్మణ సన్యాసుల లాగనె ఐరోపాజాతివారితోగాని, అస్పృశ్యులతోగాని సంపర్కం లేకుండా ఏకాంతవాసం చెయ్యడం ప్రారంభించాడు." అని జాన్ డిబ్రిటో అనే క్రైస్తవ మతాచార్యుడు వ్రాసియున్నాడు. త్వరలో ఈ నోబిలీ కేవలమూ ఒక బ్రాహ్మణ వేదంతిగా మారిపోయినాడని రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారియైన ఫ్రాస్సిస్కో రోన్ గారు అన్నారు. క్రైస్తవమత ప్రచారకుడైన ఫాదరు రాబర్టో డీ నోబిలీ అచిరకాలము లోనే 'జగద్గురు తత్వబోధకస్వామి ' అనే నూతన నామకరణంతో ప్రసిద్ధికెక్కాడు.