Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగద్గురు తత్త్వబోధక స్వామి

51

ఎందుకు బాగా జరగడంలేదని పరిశోధనచేశాడు. హిందూదేశముసముద్ర తీరాన్ని ఉన్న కొన్ని రేవు పట్నాలు పోర్చుగీసువారి స్వాధీనంలో ఉన్నా, పోర్చుగీసు క్రైస్ధవమత ప్రచారకులు హిందూదేశంలోని లోపలి భాగాలలోకి పోయి ప్రజలతో కలిసిమెలిసి వుండనందువల్ల మతప్రచారం సాగడంలేదని నోబిలీ గ్రహించాడు. 1607 డిశంబరు3 వ తేదీన నోబిలీ తన దేశానికి వ్రాసిన ఈ వుత్తరం వల్ల ఆయన అభిప్రాయాలు తెలుస్తున్నవి:-

"మధుర" ఈ రాజ్యానికి రాజధానినగరము. ధనవంతులూ, యుద్ధములందు ధైర్యవంతులూ, అయిన ప్రజలతో క్రిక్కిరిసివున్నది. కాని ఈ ప్రజలకు అసలు ఈశ్వరునిసంగతి తెలియదు. వారు కేవలము విగ్రహారాధకులు. మన క్రైస్తవమత ప్రచారకులు 12 సంవత్సరాల నుంచి ఇక్కడవుండి పనిచేస్తూవున్నా దేశీయులలో తమ అవసానకాలానికిముందు క్రైస్తవులైన ముగ్గురు నలుగురు తప్ప ఒక్కడైనా మన మతం స్వీకరించలేదు. ఇల్లాగని మన మత ప్రచారకులు అసమర్ధులుకారు. వారు చాలా సమర్ధులు, సద్గర్ములు." పూర్వకాలమునాటి రోమునగరములోని విగ్రహారాధనమువంటి విగ్రహారాధన మే ఈ మధురలో ఇప్పుడున్నదని నోబిలీ ఇంకొక వుత్తరంలో వ్రాశాడు.

క్రైస్తవమతం ఎందుకు వ్యాపించటంలేదు?

ఫెర్నాండెజ్ కృతకృత్యుడు కాకపొవడానికి గల కారణాలను నొబిలీ కనిపెట్టాడు. "రోము నగరంలో వున్నప్పుడు ఆ నగరవాసుల లాగనే ప్రవర్తించాలి" అనే సామెత ప్రకారం క్రైస్తవమత ప్రచారకుడు తాని నివసిస్తూవున్న దేశాచార వ్యవహారాలను గమనించి ఆ ప్రకారమే తానుకూడా ప్రవర్తిస్తేతప్ప లాభం లేదనిన్నీ, అలా ప్రవర్తించకపోవడమేగాక హిందూ దేశాచారాలయందు అగౌరవము కలిగించేటట్లు ప్రవర్తించడంవల్ల ప్రజలకు అనుమానము, అవిశ్వాసము కలిగి, వారు క్రైస్తవమతం దరికి చేరకున్నారనిన్నీ నోబిలీ కనిపెట్టాడు.