Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు

35

అనికూడా చెప్పతగివున్నది. పైగా మొగలు చక్రవర్తి ఇంగ్లీషు వర్తకకంపెనీవారి న్యాయస్థానాల అధికారానికి లోబడిన సామాన్యవ్యక్తివంటివాడుకాడు. ఇంతేగాక సాక్షాత్తూ సామ్రాజ్యం ఏలకపోయినా చక్రవర్తి ఢిల్లీలో తన రాజభవనములో ఒకవిధమైన దర్భారులో కొలువుతీరుస్తూ, తన దర్జాను నిలబెట్టుకుంటున్నాడు.

కంపెనీవారు మొగలు చక్రవర్తికి చేయవలసిన మర్యాదలను గౌరవాలను క్రమక్రమంగా తగ్గించడం ప్రారంభించారు. ఇంగ్లీషు ఉత్తర ప్రత్యుత్తరాలలో ఆయనను 'చక్రవర్తి ' యని పేర్కొనడం మానివేసి 'ఢిల్లీరాజు ' అని వ్యవహరించడం ప్రారంభించారు. అయితే షాఆలం చక్రవర్తిగాని ఆయన తరువాత 1806 మొదలు 1837 వరకు రాజ్యంచేసిన అక్బరుషా చక్రవర్తిగాని 1837 మొదలు 1857 వరకు చక్రవర్తిగా నున్న రెండవ బహదూర్ షా గాని తమకు జరుగవలసిన మర్యాదలలో లోపము జరగడానికి అంగీకరించినవారుకారు. అందువల్ల పారశీక బాషలో జరిగే ఉత్తరప్రత్యుత్తరా లన్నింటిలోనూ పూర్వము లాగనే చక్రవర్తి అని అర్ధమువచ్చే 'పాదుషా ' అనే బిరుదు వుపయోగింపబడుతూ వుండేది.

1828 వరకూకూడా మొగలాయి చక్రవర్తులు ఇతరులకు బిరుదులు ప్రసాదించేవారు. వాటిని కంపెనీవారు హర్షిస్తూ వచ్చారు. చక్రవర్తిగారిమీద ఆధారపడే సన్నిహితులైన వారి విషయంలో తప్ప ఇతరుల కిచ్చే బిరుదులను అంగీకరించ మని కంపెనీవారు 1828 లో నిరాకరించారు.

1835 వరకున్నూ దేశంలో చలామణి అయ్యే నాణెములను తూర్పు ఇండియా కంపెనీవారు మొగలాయి చక్రవర్తిపేరుతోనే ముద్రించేవారు. కంపెనీ రూపాయలమీద చక్రవర్తిగారిపేరే వుండేది. ఆ సంవత్సరంలో మొదటిసారి ఇంగ్లీషురాజైన నాలుగవ విలియంగారి పేరుతో నాణెములను ముద్రించి హిందూ దేశంలో కంపెనీ పరిపాలనలోవున్న రాజ్యభాగాలలో ప్రవేశపెట్టారు.