పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లా శిరస్తాదారు

25

సొమ్మును పిఠాపురం జమీందారీ ఖజానాలో నుంచి ఖర్చుపెట్టారు. ఆకేసులో కూడా ముద్దాయిని నిర్దోషి అని వదలివేశారు. "సర్కారు సంరక్షణకింద వుండే మైనరు జమీందారుల సొమ్మును ఎలాగ వృధాగా ఖర్చుపెడతారో దీనివల్ల తెలుస్తుంది. 1854 నాటికి పిఠాపురం లెక్కలలో నిల్వ యేమీ లేకుండా పోవడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చును" అని స్మాలెట్టుగారు వ్రాశారు.

నరసింగరావుగారి అర్జీలు

పైన చెప్పిన కలెక్టరుగారి సంజాయిషీ వుత్తరం ఉత్తరసర్కారుల కమిషనరు గారికి చేరినమీదట ఆయన తా నీవిషయంలో జోక్యం కలిగించుకోవడానికి నిరాకరించి పనిలోనుంచి తీసివేసిన శిరస్తాదారును కావలిస్తే గవర్నమెంటుకు చెప్పుకోమని అన్నారు. చెన్నపట్నం గవర్నమెంటువారు కిందివారి వుత్తరువును ఖాయపరచారు. జిల్లాజడ్జీ తన్ను నిర్దోషి అని నిర్ణయించి ఆకోర్టులోనే ఒక వుద్యోగం తన కిస్తారని అన్నా రనిన్నీ, సర్కారు నౌకరీని మళ్లీ చేసుకోవడానికి అనుజ్ఞ యిప్పించవలసిం దనిన్నీ, మళ్లీ రాజమహేంద్రవరం కలెక్టరుకిందనే పని చెయ్యాలని తనఉద్దేశ్యం కాదనిన్నీ నరసింగరావుగారు మళ్లీ అర్జీ దాఖలు చేసుకోగా ఈ అర్జీదారు ఏశాఖలోనూ సర్కారు నౌకరీ చేయడానికి వీలులేదని సభాయుతులైన గవర్నమెంటుగారు నిష్కర్షగా శాసించారు! పది రూపాయలకు పైబడిన జీతం గల ఏ దేశీయోద్యోగినీ కూడా అతడు చేసిన నేరం నకలును అతని కిచ్చిఅతడు చెప్పే సంజాయిషీని, తెచ్చుకునే సాక్ష్యాన్ని వినిగాని అతనిని పనిలోనుండి తీసివెయ్యకూడదని, అంతకుపూర్వం కొంతకాలం కిందటనే దొరతనమువా రొక తీర్మానాన్ని చేసివున్నా ఇప్పుడు ఈ నరసింగరావుగారి విషయంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు.

పిఠాపురం ఎస్టేటు తాలూకు చాలా సొమ్ము అపహరించడానికి ఇతడు మద్దత్తు చేశాడనే నేరంమీద ఇతనిని పనిలోనుండి తీసివేశారు. అయితే ఇతడు నిర్దోషి అని కోర్టువారు తీర్మానించారు. అంతట ఇతడు ఎంతమాత్రమూ విశ్వసపాత్రుడు కాడనే నెపంమీద ఎంతోకాలం