ఏనుగుల వీరాస్వామయ్యగారి
కా శీ యా త్ర చ రి త్ర
నూటపాతికేండ్ల క్రిందటి భారతదేశ స్థితికగతులు అందలి పుణ్యక్షేత్రాలు, వివిధప్రాంతాల స్త్రీ పురుషుల ఆచారవ్యహారాలు, దేశపరిపాలన, ప్రజల స్థితిగతులు, కన్నులకు గట్టినట్లు తేట తెలుగులో వర్ణిస్తూ విద్యాధికులైన వీరాస్వామయ్యగారు 1830-1831 సం॥ల మధ్య చెన్నపట్నంలోని తన స్నేహితునికి లేఖలుగాను దినచర్యగాను వ్రాసిపంపిన యాత్రావిశేషా లీ గ్రంధరూపకంగా ప్రకటింప బడ్డాయి. మధ్యమధ్య అనేక విషయాలను గురించి చర్ఫలు, ప్రసంగాలు ఉన్నాయి. మచ్చుకు ఈ క్రిందివిషయం చూడండి.
* * * * *
"(146) ఈ బ్రహ్మాండములో కన్యాకుమారి మొదలు కాశ్మీరమువరకు నుండే దేశము సర్వోత్తమమయిన కర్మ భూమియయి శాపానుగ్రహశక్తులయిన అగస్త్యాది ఋషులకు వాసయోగ్యమయి యుండిన్నీ ఈ బ్రహ్మాండము యొక్క చివరను వసింపుచు పూర్ఫకాలమునందు పశుప్రాయులుగా నుండిన యింగిలీషువారిచేత యిప్పుడు యేలబడి యున్నది. (147) మరిన్నీ ఇప్పుడు కర్మశూన్యులయిన ఆ యింగిలీషువారు ఈశ్వర కటాక్షమునకు ఈ కర్మ దేశస్థులకంటే యెక్కువగా పాత్రులై ఉండవలసిన కారణమేమని యోచించినంతలో నాకు శ్రీరాములు తోపచేసిన యుక్తియేమంటే తత్వబోధ సాధనమయిన విద్యాబుద్ధిలేని వారికిన్ని స్త్రీ బాలులకున్ను భక్తి జనితమయ్యే నిమిత్తముగా ముఖ్యముగా కర్మాదులనున్ను, బింబారాధనలనున్ను ఉద్దరించిన పూర్వీకు లయిన స్మర్తలు బింబాలకుమనోజ్ఞమయిన మధుఘృతాదులతోనున్ను, ఫలరసాదులతోనున్ను అభిషేకముచేసి, ఆలయాలు కట్టియుంచి అలంకరించి ఉపస్మర్తలు భక్తిని వృద్ధిచేస్తే అంతమంచిది, యెంత పెద్దగుడి చిత్రాలతో కట్టితే అంత పుణ్యము , యెన్ని విచిత్రాలతో అలంకరించితే అంత శ్రేష్టము, యెందరిని రూపవంతులయిన దాసీలను రాజోపచార నిమిత్తముగా గుడిలో వుంచితే అంత గుణ మని వ్రాసినందున యధోచితములయిన పంచామృతాభిషేకములను వదిలి అంతర్యామి రూపముతో పరమాత్మ వసింపుచు నుండే దేహములకు భోజ్యములయిన వస్తువులను విస్తరించి బింబములమీద పోయుచు వ్యర్ధ పరచుచు