పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

142

కథలు - గాథలు

సూచిస్తూవున్నందువల్ల 1565 లో జరిగిన తాలికోటయుద్ధ మనే 'రాక్షస తగ్డి ' యుద్దములో ఆళియరామరాయలు దివంగతుడై విద్యానగరాన్ని మహమ్మదీయులు కొల్లగొని నాశనం చేసిన తరువాతనే ఈ ప్రబంధము రచింపబడియుండినట్లు కనబడుతూ వున్నది. ఈ రెండు కారణాలవల్లనూ రుద్రకవి కృష్ణదేవరాయల కాలములో ఉన్నాడో లేడో అనే సంశయం కలిగి కృష్ణదేవరాయలకాలంలో ఒక రుద్రకవి వున్నట్లయితే అతడీ నిరంకుశోపాఖ్యాన గ్రంధకర్త తాతయై యుండవలెననిన్నీ, లేదా ఇత డప్పటికి బాలుడుగా నైనా ఉండవలననిన్నీ బ్రహ్మశ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రులవారు తమ చాటుపద్యమణిమంజరి రెండవభాగములో వ్రాసియున్నారు.

మంగలి కొండోజీని గురించి రుద్రకవి చెప్పిన చాటుపద్యము వల్ల గూడా ఈకవి కృష్ణదేవరాయల తరువాతి కాలం నాటి వాడేనని స్పష్టంగా ఋజువు అవుతున్నది.

చ రి త్రాం శాలు

మంగలి కొండోజీ కధలో యెంత సత్యమున్నదో తెలియదుగాని కొండోజీ మాత్రం కల్పితపురుషుడు కాదు. కొండోజీ యనే మంగలి యొకడు 1542 మొదలు 1569 వరకూ రాజ్యం చేసిన సదాశివరాయలవారి కాలంలో విశేషమైన రాజసమ్మానం పొందినట్లు శాసనాలవల్ల కనబడుతున్నది.

కృష్ణదేవరాయలవారు 1509 మొదలు 1529 వరకూ రాజ్యం చేసి స్వర్గస్థులు కాగా ఆయన తరువాత 1542 వరకూ అచ్యుతదేవరాయలవారున్నూ, 1569 వరకూ సదాశివరాయలవారున్నూ విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సదాశివరాయలవారి కాలంలో పేరునకే ఆయన చక్రవర్తి గాని సాక్షాత్తుగా పరిపాలించే ప్రభువు కృష్ణదేవరాయలవారి అల్లుడైన అరవీటి రామరాజుగారే. ఆయన అళియరామరాయలని చరిత్రలో ప్రసిద్ధి చెందియున్నారు.