Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగలి కొండోజీ

141


ఆశ్రయించినా వారు దర్శన మిప్పించలేదనిన్నీ, ఇలా వుండగా రాయలవారికి క్షౌరంచేసే మంగలి కొండోజీ ఈ కవి ఇలాగ మంత్రుల యిళ్లదగ్గిరా, వుద్యోగుల యిళ్లదగ్గిరా పడిగాపులుకాస్తూ పడివుండడం చూసి దయదలచి ఈ సంగతి రాయలవారితో మనవి చేశాడనిన్నీ, అంతట రాయలవారు కవికి దర్శనమిచ్చారనిన్నీ, అప్పుడు రుద్రకవి యీ పద్యం చెప్పాడనిన్నీ ప్రతీతి.

రాజగురువైన తాతాచార్యులవారు రుద్రకవిని ఊరు, పేరు, కుల గోత్రాలు అడిగితే కవి చమత్కారంగా పద్యంలోనే జవాబు చెప్పాడట. తరువాత రాజసభలో అనేక దుస్సమస్య లియ్యగా అవన్నీ చక్కగా పూరించాడట. అంతట రాయలవా రాయనకు తగినవిధంగా సత్కరించి తమ ఆస్థానంలో అష్టదిగ్గజా లనే కవులలో ఒక్కనిగా చేశారట. రుద్రకవి రాజగురువైన తాతాచార్యుల వారితోనూ అష్ఠదిగ్గజాలలో [1] చేరిన అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, పుత్తేటి రామభద్రయ్య, పింగళి సూరన, కవిరాట్టు, తెనాలి రమలింగకవి, భట్టుమూర్తి మొదలయిన కవులతోనూ వాగ్వాదాలు చేసేవాడనిన్నీ ప్రతీతి.

ఈ రుద్రకవికి 1550-1580 మధ్య గోలకొండ నేలుతూ కవులను ఆదరించి "మల్కిభరాం" అని పేరుపొందిన మలిక్ ఇబ్రహీంకుతుబ్ షా పాదుషాగారు రెంటచింతల (చింతలపాలెం) అనే గ్రామాన్ని యిచ్చి సత్కరించారు. ఆ గ్రామాన్ని రుద్రకవి వంశీకులు అనుభవిస్తున్నారు.

రుద్రకవి రచించిన నిరంకుశోపాఖ్యానం అనే ప్రబందంలో

   "చేరి కన్నడభూమి చెఱపట్టు పాశ్చాత్య
    నృపతిపై నొక్కింత కృప తలిర్చు"

అను సీసపద్యపాద మొకటి విద్యానగరవినాశనమును


  1. కృష్ణదేవరాయలుగారు తమ ఆస్థానములోని అష్టదిగ్గజములనే కవులకు తప్పలూరును అగ్రహారంగా యిచ్చినట్లు 2 వ నెం. స్థానిక చరిత్ర 357 వ పుట (క్రీ.శ.1528)లో నుదాహరింపబడి యున్నదని డాక్టరు నేలటూరి వెంకట రమణయ్యగారు తమ విజయనగర 3 వ రాజవంశచరిత్రలో వ్రాసినారు చూడు. పుట.421.