పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కందనూరు నవాబు రాజరికం

139


ఖరితా ఇవ్వగా నవాబు చాలా వినయంతోనూ గౌరవంతోనూ స్వీకరించాడు.'

కోటను సోదాచూడాలని కమిషనర్లు ఆయనతో చెప్పగా ఆయన మారు మాటాడక, కోటను వారికి స్వాధీనంచేసి తాను తన పరివారజనమూ హంద్రినది యుడ్డున నున్న జోహరాపురమునకు పోయి అక్కడ వేచియున్నాడు. ఈ అవమానం సహించలేక అతని మామగారైన నాందిరీఖానుగారు తిరుగుబాటుచేశాడట.

అంతట ఆ కోటను సోద చెయ్యడానికి నియమింపబడిన కమీషనర్లు కోటను, నవాబుగారి అంత:పురాన్ని జాగ్రత్తగా సోదా ఛెశారుగాని ఏమీ దొరకలేదు. కోటలో మందుగుండు సామానుయేమీ కనపడలేదు. నవాబుగారు దోషి యనడానికి తగిన నిదర్శనాలేమీ కనబడలేదు.

నవాబుగారి జనానాను అంటివున్న వుద్యానవనం పెద్దగోడల మధ్య గదులుగదులుగా కేటాయింపు చేయబడి వున్నది. ఏమైనావుంటే అక్కడే రొదుకుతుందని అనుకున్నారుగాని అక్కడకూడాఎంత వెదకినా అనుమానం కలిగేది ఏమీ కనబడలేదు. అయితే ఇదివరకు వచ్చిన ఆచూకీ సులభంగా తీసిపారేయడానికి వీలైనదికాదు. గనక ఈ జనానావుద్యానవనాన్ని మళ్లీ ఇంకొకమాటు ఇంకా జాగ్రత్తగా పరిశోధించడానికి నిశ్చయించారు. ఆ ప్రకారం పలుమూలలా శోధిస్తూ వుంటే అందరికీ ఆశ్చర్యం కలితేటట్టుగా ఈజనానా వుద్యానవనంలో ఒక రహస్యపు ఆయుధాగారం బయటపడింది. ఈ వుద్యానవనంయొక్క ఆవరణపు గోడలన్నీ మధ్య ఖాళీలతో రెండు వరసలుగా కట్టి, పైన సామాన్యమైన కోటగోడలలాగ కనబడుతూ లోపల బోలుగా కట్టినవే. వాటిలోపలి ఖాళీలలోనూ నేలసొరంగాలలోనూ, ఆరు యేడు వందల ఫిరంగులూ, ఫిరంగిబళ్లూ, ఫిరంగిగుళ్లూ, తోటాలూ, తుపాకులూ, మందుగుండుసామానూ, ఫిరంగులు పోతపోయడానికి కావలసిన కొలుములూ భద్రపరచి వున్నాయి. ఇందులో చాలా ఫిరంగులు కొత్తగా తయారు చేసినవి. కొలుములుకూడా అప్పటికి కొద్దికాలంక్రిందటనే వ్యుపయోగించినట్లు కనబడ్డాయి.