పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కందుకూరు నవాబురాజరికం

133


లాక్కొని ఇతణ్ని తిరుచురాపల్లికి రాజకీయ ఖైదీగా పంపారు. అక్కడ ఇతడు క్రైస్తవమతాభిమానం చూపుతున్నాడని ఒక మహమ్మదీయుడికి కోపం వచ్చి ఇతనిని 1840 లో పొడిచి చంపాడు.

కర్నూలు నవాబు రాజ్యాన్ని లాక్కునేటప్పుడు అతడు అదివరకు తన సరదారులకూ, బంధువులకూ యిచ్చిన జాగీరులు కూడా కుంఫినీవారు తీసుకొని ఆయన కుటుంబం వారికి రెండు లక్షరూపాయలకు పైగా పింఛనులను రద్దుచేశారు.

ఈ రాజ్యాన్ని లాక్కున్న తరువాత దానికి ఒక బ్రిటిషు కమీషనరును ఏజెంటు అనే పేరుతో నియమించి భూమిని రైతువారీ బందోబస్తు చేశారు. 1858 లో తక్కిన నాలుగు తాలూకాలూ కలిపి ఒక కలెక్టరుక్రింద ప్రస్తుతమున్న కర్నూలు జిల్లాను నిర్మించారు. శ్రీశైలాన్ని కొన్నాళ్ళు కుంఫినీవారే పరిపాలించి 1840 లో ఆ దేవస్థానానికి పుష్పగిరి పీఠాధిపతులను ధర్మకర్తలుగా నియమించారు. (Imperial Gazetteer-Provincial Series, Madras Vol.I pp.406-7)

ఏనుగుల వీరాస్వామయ్యగారి వర్ణన

ఏనుగుల వీరాస్వామయ్యగారు 1830-1831 మధ్య కాశీ యాత్ర చెయ్యడంలో ఈ కర్నూలు నవాబురాజ్యంలో చేరిన పుణ్యక్షేత్రాలను దర్శించారు. అక్కడి రాజకీయ సాంఘిక స్థితిగతులను వర్ణించారు. వీరాస్వామయ్యగారు కడపనుండి శ్రీశైలానికి ప్రయాణం చేసే దారిలో దువ్వూరు వరకు కడపజిల్లా చేరిన భూమి అనిన్నీ, తరువాత వంగలి అనేవూరు 'కందనూరి నవాబు' దనిన్నీ వ్రాస్తూ రూపసింగు అనే సర్దారుకు కొలువుకుగాను ఈ గ్రామం వగైరా కొన్ని వూళ్లు జాగీరుగా ఇవ్వబడిన వని ఇలా వ్రాశారు. "ఎగువ అహోబిళములో ఉత్సవకాలమందు 400 వరహాలు హాశ్శీలు వసూలు అవుతున్నవి. వాటినంతా కందనూరి నవాబు పుచ్చుకొని వెనక గుళ్ళసంగతినే విచారింపడు"(కాశీయాత్రచరిత్ర, పుట 10)

వీరాస్వామయ్యగారు అహోబళంనుంచి మహానందికి వెళ్ళారు.