పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కథలు - గాథలు


నుంచి వెలిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు! దేశములోని తెలుగు భాగాలు కూడా తమవే నంటున్నారు. ఇంక ఉమ్మడిప్రదేశాలన్నీ తమ వనడంలో ఆశ్చర్య మేమున్నది! ఈ సందర్భంలో దేశచరిత్రను కూడా తమ కింపుగా ఉండేటట్లు మార్చి వ్రాయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలము ద్రావిడ దురభిమానావేశము గలవారుమాత్రమే ఇలాంటి పిచ్చిపనులు చేస్తే చింతలేదు. డాక్టర్ ఎస్. కృష్ణస్వామి అయ్యంగారివంటి ప్రాజ్ఞులైన చరిత్రకారులుకూడా తమ రచనలలో అరవభిమానం చూపిస్తూ సత్యాన్ని మరుగునపరచడము, చరిత్రాంశాలకు అపార్ధంకల్పించడం చాలా దు:ఖకరమైన సంగతి. తిరుపతి చరిత్రలో వారు తెలుగు భాషకు, తెలుగువారికి చేసిన అన్యాయము మరీ ఎక్కువగా నున్నది. వేంకట శబ్ధముతోపాటు తిరుమలను, తిరుపతిని అరవవారి స్వంత హక్కుగల సొత్తుగా నిరూపించాలని కృష్ణస్వామయ్యంగారు చాలా తంటాలుపడ్డారు. తిరుపతి దేవస్థానపు శాసనాలను పరిశోధించి నివేదికను తయారుచేసిన సాధు సుబ్రహ్మణ్యంగారి నివేదికను, ఈ తిరుపతి చరిత్రను పోల్చి చూస్తే కృష్ణస్వామయ్యంగారి పక్షపాతపు వ్రాతలు కొంతవరకూ తెలుసుకోవచ్చును.

మన తెలుగు చరిత్రకారులు, పరిశోధకులు, విశ్వకళాపరిషత్తు వారు, తెలుగుప్రజలూ చరిత్రరచనలలో మనకు జరుగుతూవున్న ఈ అన్యాయాన్ని గురించి ఎందుకు ఆలోచించరో తెలియడం లేదు. బ్రతికిచెడిన జాతి ఈ యాంధ్రజాతి అనియైనా స్మరించుకుంటే కృతార్దులం మవుతాము.