పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కథలు - గాథలు

అవసరం తిమ్మయ్య యనీ, అమరం తిమ్మయ్య యనిన్నీ, వాకిటి తిమ్మయ్య యనిన్నీ పైన చెప్పిన శాసనాలలో పేర్కొనబడిన తిమ్మన్న గారే ఈ తిమ్మప్పయని చెప్పడానికి సందేహము లేదు.

ఇతర రాజసేవకులు

కృష్ణదేవరాయలవారి కొలువులోవుండి ఆయనకు సేవచేసే సద్వంశసంజాతులైన ఇతరనాయకులనేకుల పేర్లు తిరుపతి శాననాలలో కనబడుతున్నవి.

'ఊడియం ' ఎల్లప్పనాయకుడు

ఊడియం ఎల్లప్పనాయకుడు డనే రాజొద్యోగి కృష్ణదేవరాయల వారికీ, ఆయన తరువాత రాజ్యంచేసిన అచ్యుత దేవరాయల వారికి సన్నిహితభృత్యుడుగా వుండేవారు. ఊడియ మనే పదము ఊడిగ మనే మాటకు రూపాంతరము. ఇతడు 'కల్ తేరు ' అనగా రాతిరధం దగ్గర సత్రం నిర్మించినట్లున్నూ, తిరుపతిలో గోవింద రాజస్వామి వారికి దానం చేసినట్లున్నూ క్రీ.శ.1527 నాటి ఒకశాసనంవల్ల కనబడుతూ వుంది.

'అడపం ' బయ్యప్పనాయకుడు

అడప మంటే వక్కలు, ఆకులు మొదలైన తాంబూలపు ద్రవ్యము లుంచే సంచి దీనిని సంబెళమనికూడా అంటారు. ఆకాలంలో సామాన్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక అడపను పట్టుకొనివెళ్ళేవారు. కృష్ణదేవరాయలవారు రచించిన ఆముక్తమాల్యద 7-వ ఆశ్వాసంలో 7-వ పధ్యంలో దీని వర్ణన కనబడుతూ వుంది. ఇది శ్రీమంతులనుభవించే భోగాలలో ఒకటి. అందువల్ల రాజాధిరాజులైన విజయనగర చక్రవర్తులకు తాంబూలద్రవ్యముల యుద్యోగి యొక డుండుడంలో ఆశ్చర్యమేమున్నది? కాశ్యపగోత్రుడైన తిమ్మప్పనాయకుడి కుమారుడైన ఈ బయ్యప్ప కృష్ణదేవరాయలవారి కాలంలోను, అచ్యుత దేవరాయలవారి కాలంలోనూ కూడా ఈయుద్యోగం చేసినట్లు అతడు తిరుపతి వెంకటేశ్వరస్వామికి 55,320 నార్పణములు సమర్పించి క్రీ.శ. 6-9-1538 సం॥ లో చెక్కించిన శాసనం వల్ల తెలుస్తూవుంది.