పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

కథలు - గాథలు

అనేక తంత్రాలు, తమాషాలు చేస్తూ అమిత వ్యయం చేయించేది. తన యిష్టం వచ్చినట్లల్లా ఆడించేది.

ఇలాగు కలెక్టరు ఉపేక్షవల్లా, దుబాషీ దుర్మార్గంవల్లా జిల్లా వ్యవహారం దు:స్థితిలోకి దిగిపోయింది. సర్కారు శిస్తు వసూలు మందగించింది. అప్పుడు చెన్నపట్నంరాజధాని గవర్నరు క్లైవుప్రభువు శిస్తులు ఎందువల్ల సరీగా వసూలు కావడం లేదని సంజాయిషీ అడిగాడు. వర్షాలు సకాలంలో కురవలేదనిన్నీ, అందువల్ల పంటలు బాగా పండలేదనిన్నీ, ప్రజలలో డబ్బు లేదనిన్నీ, జిల్లాలో జమీందార్లు చెప్పినమాట వినడం లేదనిన్నీ, ఖోండుజాతివాళ్లు అల్లరిచేస్తున్నారనిన్నీ, శాంతిభద్రతలు నెలకొల్పడానికి శిస్తు వసూలుకు తగిన మిలిటరీ బందోబస్తు సిబ్బంది తనకు లేదనిన్నీ స్నాడ్ గ్రాస్ జవాబు చెప్పాడు. కాని చెన్నపట్నం రెవెన్యూబోర్డువారు మోసపోయేవారుకాదు. సర్కారుదస్తు ఫాజలు (అపహారం) కేసు కప్పిపుచ్చడానికి ఇంత తెలివితేట లైనజవాబు ఇదివరలో ఏకలెక్టరూ చెప్పినది లేదని అన్నారు. గవర్నమెంటువారు కూడా ఇలాగే అభిప్రాయపడి స్నాడ్ గ్రాసును కలెక్టరు పదవిలోనుండి తొలగించి బ్రౌను అనే అతనిని కలెక్టరుగా నియమించారు. ఈబ్రౌను గంజాం వచ్చేటప్పటికి కొంతకాలం పట్టింది. వచ్చినతరువాత స్నాడ్ గ్రాసును చార్జీ వప్పగించేటట్లు చేయగలిగేటప్పటికి ఇంకా కొంతకాలం పట్టించి. స్నాడ్ గ్రాసును రంభదగ్గరనుంచి కదిలించేటప్పటికి గవర్నమెంటువారి తాతలు దిగివచ్చారు.

స్నాడ్ గ్రాసు స్థానే నియమింపబడిన కొత్తకలెక్టరు బ్రౌను గంజాంజిల్లా వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి ప్రయత్నించాడు. కాని అది సులభసాధ్యం కాలేదు. అవి అంత గందరగోళంలొ వున్నాయి. మంచి అభివృద్ధిలో వుండిన జిల్లా పాడైపోయిందనిన్నీ, జనసంఖ్య కూడా క్షీణించిదనిన్నీ ఇతడు పైకి వ్రాశాడు. దుబాషీని అరెస్టుచేశారు కాని అత డెంతసొమ్మొ అపహరించిందీ సరిగ్గా తెలుసుకొవడానికి వీలు కాలేదు. బయటపడిన రెండుపద్దులే ఒకలక్ష అరవైవేల రూపాయిలు దాకా తేలినాయి. ఈద్రవ్యాపహరణానికి అతనిమీద దస్తు