కాశీమశీదులో శివలింగం
111
ఏమవుతుంది?" అన్నాడు. "బహుశ: కిరస్తానీమతం అవుతుందేమో!" అని రెండవవాడన్నాడు.
కంపనీవారు ఇలాగ బందోబస్తు చేసినందువల్ల అల్లరి సద్దు అణగింది.
ఈ కల్లోలం అణగినతరువాత మళ్లీ ఆసంగతి తలుచుకునే టప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైనవి. వారికి తీవ్రమైన విషాదం కలిగింది. "పవిత్రమైన కాశీక్షేత్రం అపవిత్రమైపోయినది. అతి పవిత్రమైన గంగాజలములో రక్తం కలిసింది. ఈకాశీమహాత్య్మం పోయింది. ఇంక ఇక్కడమోక్షం దొరకదు" అనే ఆలోచనలతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతిరేఖలతో పైమీద బట్టలుకూడా లేకుండా దు:ఖసూచకంగా గంగానదీ తీరాన్నివున్న ముఖ్యఘట్టాలకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని తలలు వంచుకొని కూచుని మళ్లీ ఇళ్లకు పోకుండా అక్కడనే పడివుండి ఒక మెతుకైనా తినకుండా ప్రాణంపై ఆశ విడిచి ప్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు.
ఇలాగ రెండుమూడు రోజులు గడిచినవి. ఇది చూసేటప్పటికి చాలామంది మనస్సులు కరిగినవి. వీళ్లను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్లకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికితోచింది. ఈ సంగతినీ వీరు కాశీలోని మేజస్ట్రేటుల చెవిని వేశారు. అంతట కంపనీవారి ఆంగ్లేయోద్యోగులందరూ గంగా నదీతీరానికి వెళ్ళి అక్కడ ఘట్టాలలో ఇలాగ వుపవాసంచేస్తూవున్న బ్రాహ్మణులను చూచి వగచి, తాము నివారించడానికి ఎంతోకష్టపడి ప్రయత్నించినా లాభంలేక తమవశం తప్పి జరిగినదానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడము బాగా లేదనిన్ని జరిగిన అక్రమాలను కొంత ప్రతిక్రియ జరిగించేవున్నారుకదా అందుకోసం మళ్ళీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి, వాళ్ళను బుజ్జగించగా, వారందరూ చాలా దు:ఖించి తరువాత కొంత ఊరట చెందారు.