పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కథలు గాథలు

ఆప్రకారం వారు 1776 వ సంవత్సరం ఆగుస్టు 24 వ తేదీన పిగట్టు గారిని, పట్టుకొని ఖైదుచేశారు.

అప్పుడు గవర్నరుగారి కొక ఉపాయం తట్టింది, చెన్నపట్నం రేవులోను కోటలోనూ కంపనీ ప్రభుత్వంవారు అధికారం చలాయిస్తూ వున్నా సముద్రంమీద వారికలాంటి అధికారాలు లేవు. సముద్రము మీద నున్న ఇంగ్లీషు యుద్దనౌకలపైన అధికారియైన అడ్మిరల్ ఇంగ్లీషురాజుగారి ప్రభుత్వోగి. అతనికి సర్వాధికారాలుంటాయి. అందువల్ల చెన్నపట్నం దగ్గర సముద్రంలో నున్న నౌకల అధికారియైన అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ హ్యూస్ గారి నాశ్రయించి తన నొక నౌకమీదికి తీసుకునివెళ్లి కాపాడవలసినదని పిగట్టు ప్రార్ధించాడు. అంతట పిగట్టు గారిని తనకు వప్పగించవలసినదని అడ్మిరల్ గారు కార్యాలోచన సభవారిని కోరారు. నౌకలమీద ప్రభుత్వాధికారాలన్నీ అడ్మిరల్ గారివే యైనా రేవులో కంపెనీ ప్రభుత్వంవారి వశంలో నున్న కంపెనీ యుద్యోగులను తన నౌకమీదికి తీసుకుని వెళ్లడానికి ఆయనకు అధికారం వున్నట్లు తగిన శాస్త్ర దృష్టాంతరం తమకు కనబడనందువల్ల పిగట్టుగారిని ఆయనకు వప్పగించడానికి వీలులేదని వారు నిరాకరించారు. ఇంగ్లీషురాజుగారి ప్రభుత్వాధికారిగా తనకర్తవ్యాన్ని నిర్వర్తించగలందులకు తాను చెప్పవలసిన మాట చెప్పినాననిన్నీ వారు తనమాట విననందువల్ల కలిగే ఫలితాలకు తాను ఉత్తరవాదిని కాదనిన్నీ చెప్పి అతడు వూరుకున్నాడు.

చెన్నపట్నం గవర్నరు కార్యాలోచన సభవారు పిగట్టుగారి నొకచోట ఖైదుచేసి వుంచారు.

గవర్నరుజనరల్ ఉపేక్ష

అప్పట్లోకంపెనీవారి రాజ్యానికంతా గవర్నరు జనరలుగా కలకత్తాలోనున్న వారన్ హేస్టింగ్సుగారికి చెన్నపట్నంలో జరిగిన సంగతులు మెల్లిగా తెలిసినవి. అయితే కార్యాలోచన సభలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా తానేమీ చేయదలచ లేదని